చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు.
పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్‌లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్‌డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు.
ఎన్‌డీఏతోపాటు ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు
మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది.
నా మొదటి ఆశయం ఇదే
చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment