నాగార్జున
శివ.. గ్రీకువీరుడు.. మన్మథుడు.. అన్నమయ్య.. శ్రీరామదాసు... క్లాస్, మాస్, ప్రేమ, భక్తి... ఏదైనా ఓకే అంటారు నాగార్జున. వంద సినిమాలకు చేరువ అవుతున్న నాగ్ నటించిన ‘ఆఫీసర్’ జూన్ 1న విడుదల కానుంది. ‘శివ’లాంటి ట్రెండ్‌సెట్టర్‌ని క్రియేట్ చేసిన నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం మరో ట్రెండ్‌సెట్టర్ అవుతుందా? వేచి చూడాలి. ఈలోపు నాగార్జున చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.
► ‘ఆఫీసర్’ మూవీకి మిమ్మల్ని ఒప్పించటానికి రామ్‌గోపాల్ వర్మ లెటర్ రాశారట? అందులో ఏముంది?
యాక్చువల్లీ సినిమా ఒప్పుకున్న తర్వాతే లెటర్ రాశాడు. ‘‘మీరు వంద శాతం సంతృప్తి చెందేలా సినిమా తీయకపోయినా, నేను పని చేయకపోయినా నన్ను తన్నండి...’’ అంటూ చాలా పెద్ద లెటర్ రాశాడు. అన్నట్టుగానే చాలా బాగా తీశాడు.
► అలా ఎందుకు రాశారు?
‘ఒక రియల్ లైఫ్ ఆఫీసర్ స్టోరీ రెడీ అయింది. మీతో చేయాలనుంది’ అని నా దగ్గరకి వచ్చాడు. అతనితో ‘హీరోయిజమ్ ఉన్న సినిమాలే నీ బెస్ట్ జానర్. అవి కాకుండా పిచ్చిపిచ్చివి ఏవేవో చేస్తుంటావు. హండ్రెడ్ పర్సంట్ కాన్‌సన్‌ట్రేట్ చేస్తే చేస్తాను’ అన్నాను. అందుకే అలా రాశాడు.
► వర్మ తనకు ఎమోషన్స్ లేవు అంటుంటారు?
అలా అన్నాడంటే తన ఎమోషన్స్‌ని గుర్తిస్తున్నట్టేగా? ఎమోషన్స్ తెలిస్తేనే అలా అనగలుగుతాడు.
► అంటే.. ఈ సినిమా మొదలయ్యే ముందు వర్మకు కండీషన్స్ ఏమైనా పెట్టారా?
కండీషన్స్ ఏమీ లేవు. నాకు నీ పూర్తి కాన్‌సన్‌ట్రేషన్ కావాలి అని అడిగాను. రామూ సినిమాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. కేవలం ఫైట్స్ కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా రియల్‌గా ఉంటాయి. సౌండ్, ఎడిటింగ్‌లో వర్మ ఎక్స్‌పర్ట్. వర్మ ఎర్లీ మూవీస్ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ అవుట్‌స్టాండింగ్‌గా ఉంటాయి. అదే చెప్పి, ‘అవి నీ అడ్వాంటేజస్ .. వాడుకో’ అన్నాను. కండీషన్‌గా కాదు రిక్వెస్ట్ చేశా.. ఫ్రెండ్లీగా.
► ట్వీటర్‌లో వర్మ కాంట్రవర్సీ సెలబ్రిటీ. ఈ టైమ్‌లో ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?
అలా అనుకుంటే ప్రతి సినిమా రిస్కే. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ టీమ్ ఉన్న సినిమాలు కూడా రెండో రోజు లేకుండా పోయాయి. ‘నిన్నే పెళ్లాడతా’ వంటి హిట్ తర్వాత నేను, కృష్ణవంశీ ‘చంద్రలేఖ’ సినిమా చేశాం. మలయాళ హిట్ సినిమా రీమేక్ అది. కానీ, తెలుగులో మూడో రోజుకే సినిమా థియేటర్లో లేదు. హిట్‌కి ఫార్ములా అనేది లేదు.
► వర్మ బెస్ట్ టెక్నీషియన్. కానీ ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు..
పూర్తి శ్రద్ధతో చేస్తే వర్మ ఈజ్ గుడ్ ఫిల్మ్ మేకర్. తలుచుకుంటే ఇంకా మంచి సినిమాలు తీయగల సామర్థ్యం ఉన్నవాడు. ఎక్కడో తను దారి తప్పాడు. ‘ఒకవేళ ‘ఆఫీసర్’ సినిమా కూడా అలాంటిదే అయితే వద్దు. మనం రెండు నెల్లకోసారి కలుద్దాం. పార్టీ చేసుకుందాం. మనమిద్దరం సినిమా చేయాలని ఇప్పుడు ఎవ్వరూ అడగట్లేదు. నువ్వు వంద శాతం ఈ సినిమాకి ఇస్తా అంటే చేద్దాం’ అన్నాను. ‘ఆఫీసర్’ కథ 2016లోనే చెప్పాడు. అప్పుడే తీయకుండా అతను కాన్‌సన్‌ట్రేషన్‌తో ఉంటాడా? లేదా అని ఆగాను.
► ట్రెండ్ సెట్టర్ ‘శివ’ ఇచ్చారని వర్మకు డేట్స్ ఇచ్చారా?
అలా ఎప్పుడూ ఆలోచించను. అలాంటివి అసలు పట్టించుకోను. ఏం ఆలోచించి కల్యాణ్ కృష్ణకి ‘సోగ్గాడే చిన్ని నాయన’ చాన్స్ ఇచ్చాను. నాకు అనిపిస్తే చేసేస్తుంటా. నా కెరీర్ అంతా అలానే సాగింది.
► వర్మ రీసెంట్ కాంట్రవర్సీ వల్ల ఈ సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని వర్రీ అయ్యారా?
వర్రీ అనేది ప్రతి సినిమాకు ఉంటుంది. 95 సినిమాలు చేసేశాను. ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది (నవ్వుతూ). ఈ ఫేజ్‌లో సినిమాలను ఎంజాయ్ చేయాలి. రోజూ హ్యాపీగా వెళ్లి నవ్వుతూ పని చేయాలి. లాజికల్‌గా మాట్లాడాలంటే 65 పర్సెంట్ మూవీ లైఫ్ అయిపోయింది. మిగతా 35ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి.. అంతే.
► వివాదాల జోలికి వెళ్లొద్దని వర్మకు సజెస్ట్ చేశారా?
ఎవరి జర్నీ వాళ్లకుంటుంది. అది వాళ్ల ఇష్టం. ఇంకొకరి లైఫ్ గురించి మాట్లాడను. ఒక మనిషిని ఎందుకు చేంజ్ చేయాలి మనం. సజెషన్స్ సినిమాల గురించే ఇస్తాను. పర్సనల్ లైఫ్ తన ఇష్టం. నా పిల్లలకే ఇలా ఉండాలని చెప్పను. గైడ్ చేస్తాను అంతే. సొసైటీకి ఎటువంటి ఇబ్బంది కలిగించనప్పుడు వాళ్ల ఇష్టం. ఒకర్ని జడ్జ్ చేసి మీరు ఇటువంటి వారని చెప్పడం నాకిష్టం ఉండదు. మై జర్నీ ఈజ్ క్లీన్ అండ్ క్లియర్. ‘ఆఫీసర్’ సినిమాలో నమ్ముకున్న నిజం కోసం హీరో ఏదైనా చేస్తాడు. నేను నమ్ముకున్న సినిమా కోసం ఏదైనా చేస్తాను. తన పర్సనల్ కాంట్రవర్సీల మీద కామెంట్ చేయదలుచుకోలేదు.
► ‘ఆఫీసర్ స్క్రిప్ట్ నాది’ అని ఒకతను స్క్రిప్ట్ లీక్ చేసేశారు కదా?
ఇది వరకు రెండు సినిమాలకు కూడా అతను ఇలానే చేశాడు కదా. ఈ స్క్రిప్ట్ అంతా మేమే టీజర్‌లో చెప్పాం. కొత్తగా చెప్పటానికి ఏం లేదు. సినిమా చాలా రియలిస్టిక్‌గా జరుగుతుంది. ఈ కథ పోలీస్‌కి, పోలీస్‌లకి మధ్య జరిగేది. రామూకి క్రిమినల్స్, మాఫియా మీద చాలా నాలెడ్జ్ ఉంది. తన సినిమాలన్నీ అలానే ఉంటాయి కదా.
► అఖిల్‌తో సినిమా ఉంటుందని వర్మ ట్వీట్ చేశారు?
నేను ట్వీట్ చేయలేదు కదా. వాళ్లిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.. చూద్దాం.
► మీ అబ్బాయిల కన్నా మీరే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు.
చైతన్య కూడా అదే అంటాడు. ‘మీకేంటి నాన్నా.. చాలా సినిమాలు చేసేశారు. మీ సినిమా హిట్టయినా, ఫెయిలైనా పట్టించుకోరు. మాకు అలా కాదు. చాలా జాగ్రత్తగా చేయాలి’ అంటాడు.
► ‘మహానటి’లో మీ నాన్నగారి పాత్రలో చైతన్యని చూశాక ఏమనిపించింది?
హ్యాపీగా అనిపించింది. నాన్నా, చైతన్య ఒకేలా ఉంటారని కాదు. కానీ నాన్న పాత్రలో తనని చూసినప్పుడు చెప్పలేని ఫీలింగ్ కలిగింది. ‘దేవదాస్’ పాత్రలో చైతన్యని చూస్తుంటే హ్యాపీ అనిపించింది.
► ‘సవ్యసాచి’లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్‌లో మీ అంత బాగా చైతూ చేస్తారనే నమ్మకం ఉందా?
నాకంటే చైతన్య చాలా బాగా చేస్తాడు అనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఇప్పుడు యంగ్‌స్టర్స్ అందరూ బాగా చేస్తున్నారు.
► మీ 100వ సినిమాను ప్లాన్ చేసుకున్నారా?
100వ సినిమాను చాలా కన్వీనియంట్‌గా పెట్టుకున్నాను. నాకు ఇష్టమైనప్పుడు గెస్ట్ రోల్స్ యాడ్ చేసుకుంటా. లేదంటే వాటిని కలపకుండా ఇది నా 100వ సినిమా అని చెబుతా. లేదా సినిమా హిట్ అయినప్పుడు ఇదే 100వ సినిమా అని చెబుతా. ఏం ప్లాన్ చేయలేదు. బట్ ఇది మాత్రం పెట్టుకున్నాను. 100 ఈజ్ జస్ట్ ఎ నంబర్.
► మళ్లీ టీవీ షోలు చేస్తారా?
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రన్ అయిపోయింది. ఏదైనా ఇంట్రస్టింగ్ షో వస్తే తప్పకుండా చేస్తాను.
► నెక్ట్స్ సినిమాలు?
నానీతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను. ఒక డాన్‌కి డాక్టర్ మధ్య జరిగే కథ ఇది. మలయాళంలో దర్శకుడు ప్రియదర్శన్ ‘కెప్టెన్ మరార్కర్’ లైఫ్‌పై ఓ సినిమా తీస్తున్నారు. ‘అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు చేయాలి’ అని అడిగారు ప్రియదర్శన్. æహీరో ధనుష్ తన డైరెక్షన్‌లో మామ రజనీకాంత్ కోసం ఒక కథ తయారు చేశారు. రజనీగారు పాలిటిక్స్‌తో బిజీగా ఉండటంతో ఆ కథకు నన్ను అడిగారు. చూడాలి.. ఏది ఫైనల్ అవుతుందో.
► యంగ్‌స్టర్స్ చాలా మంది వస్తున్నారు. మీ పిల్లలకు మీరేం చెబుతారు?
యంగ్ టాలెంట్‌ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఫస్ట్ సినిమాలోనే అద్భుతంగా నటిస్తున్నారు. అసలది ఫస్ట్ ఫిల్మ్‌లా అనిపించదు. అంత బాగా చేస్తున్నారు. స్టార్ కిడ్స్ అని కాదు. స్టార్‌కే గతి లేనప్పుడు స్టార్ కిడ్స్‌కి ఏముంటుంది? టాలెంట్‌కే ఇక్కడ చోటు ఉంటుంది. బ్యూటిఫుల్ టాలెంట్ ఈజ్ కమింగ్.
23తో ఏదో ఉంది!
మే 23 నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’ రిలీజైంది. నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రిలీజైంది కూడా అదే తేదీనే. కానీ అందరికీ తెలియనిదేంటంటే ఆర్టిస్ట్‌గా ఫస్ట్ సినిమా చేయడానికి నాన్నగారు చెన్నై వెళ్లింది కూడా మే 23నే. 22 రాత్రి విజయవాడలో ట్రైన్ ఎక్కి, చెన్నై వెళ్లి మర్నాడు షూటింగ్‌లో పాల్గొన్నారు. సో.. 23తో మా ఫ్యామిలీకి ఏదో ఉంది.
‘విక్రమ్’లో నాగార్జున
నాన్నగారిది హ్యాపీ లైఫ్
నాన్నగారి లైఫ్ సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేశారాయన. అలాంటి స్ట్రయిట్ లైఫ్‌తో బయోపిక్ అంటే ఆడియన్స్‌కు నచ్చుతుందా? ఆయన కెరీర్‌లో డౌన్ ఫాల్ లేదు. పోనీ ఎవరి దగ్గరైనా మోసపోయి ఉండాలి. అదీ లేదు. పిల్లలందరితో హ్యాపీగా ఉన్నారు. కలసి యాక్ట్ చేశారు కూడా. అందుకే బయోపిక్ కంటే కూడా పుస్తక రూపంలో వస్తే బావుంటుంది.
ఏఎన్నార్7
Comments
Please login to add a commentAdd a comment