
విద్యావనంలో ‘రియల్’ మొక్క!
విద్యాశాఖలో ఓ ఉద్యోగి బాగోతం ఇది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ శాఖ ఉద్యోగి.. ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తూ కథ నడిపిస్తున్నారు.
పోలీసులతో కలిసి వెంచర్లు
- విద్యా శాఖలో చక్రం తిప్పుతున్న ఓ అధికారి
- ఏళ్ల తరబడిగా ఒకేచోట తిష్ట
- పోలీసు ఉన్నతాధికారులతో పరిచాయాలని ప్రచారం
- కల్లూరు మండలంలో భారీగా వ్యాపారం
- ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: విద్యాశాఖలో ఓ ఉద్యోగి బాగోతం ఇది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ శాఖ ఉద్యోగి.. ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తూ కథ నడిపిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా పోలీసు అధికారులతో సంబంధాలు పెట్టుకుని రియల్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. తనపై ఎవ్వరూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. అనేక మంది పోలీసులకు ఈయన బినామీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. భారీగా వెంచర్లను వేస్తూ అదే పనిలో బిజీగా ఉంటున్నారు. ప్రధానంగా కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో ఈయన భారీగా వెంచర్లు వేశారని సమాచారం. అయినప్పటికీ ఈయనపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు.
ఆరోపణలున్నా...!
వాస్తవానికి విద్యాశాఖలో అనేక సంవత్సరాలుగా ఈయన తిష్టవేశారు. ఈయన స్థానాన్ని ముట్టుకునేందుకు కూడా ఎవ్వరూ సాహసించడం లేదు. పైగా రియల్ వ్యాపారంలో మునిగి.. ఉద్యోగం కూడా సరిగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఈయనపై ఇప్పటివరకు కనీసం విచారణ కూడా చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో తనకు ఉన్నతాధికారులు తెలుసని బెదిరిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈయనపై ఈగ వాలనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. పలువురు ఈయన వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ల వివరాలతో పాటు నేరుగా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలుస్తోంది.
ఉన్నతాధికారులతో మాట్లాడతారా...!
ఈయనను టచ్ చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా భయపడుతున్నారంటే ఏ స్థాయిలో బెదిరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తనకు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని ప్రచారం చేసుకోవడం ఈయనకు రివాజు. అంతేకాకుండా ఈ రోజు ఉదయమే ఫలానా పోలీసు ఉన్నతాధికారితో టిఫిన్ చేశానని చెప్పుకుంటారనే ప్రచారం ఆ శాఖలో జరుగుతోంది. ఒకవేళ నీపై ఫలానా ఆరోపణ వచ్చిందని ఎవరైనా అధికారి అంటే.. ఇదిగో గతంలో ఇక్కడ పనిచేసిన విద్యాశాఖ అధికారితో గానీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో కానీ మాట్లాడతావా? అడిషనల్ డీజీపీతో మాట్లాడతావా అని నేరుగా వెంటనే ఫోన్ తీసి బెదిరింపులకు పాల్పడటం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో గొడవ ఎందుకులే అని విద్యాశాఖ సిబ్బంది ఈయనను టచ్ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద విద్యాశాఖలో వెలిసిన ఈ రియల్ మొక్కను తొలగించేందుకు ఎవ్వరూ సాహసించడం లేదన్నది మాత్రం వాస్తవం.