
లేహ్/జమ్మూ: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్టులో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని సియాచిన్‌లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యురీ కార్ప్స్ మంగళవారం తెలిపింది.
సైన్యంలో లింగసమానత్వం పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో కెప్టెన్ ఫాతిమా నియామకం ఒకటని తెలిపింది. సియాచిన్ బ్యాటిల్ స్కూల్‌లో కఠోర శిక్షణ పొందిన ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ పోస్టులో బాధ్యతలు చేపడతారని వివరించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈమె బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కెప్టెన్ గీతికా కౌల్‌ను సియాచిన్‌లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమించినట్లు ఈ నెల మొదటి వారంలో ఆర్మీ ప్రకటించింది.