అది 1917.. బీహార్‌లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు.
నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు.
1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు.
బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్‌కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు.
బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది.
1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?
Comments
Please login to add a commentAdd a comment