ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా కొడియా, కోరాపూట్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టుల, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. చనిపోయిన వారందరికి సంఘటన స్థలంలోనే పోస్ట్మార్టం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్కాన్గిరిలో ఎన్కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అయితే ఆ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు గాజర్ల రవి భార్య మీనా ఉన్నట్లు సమాచారం.
కొడియా, కోరాపూట్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశామయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ క్రమంలో 14 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో నలుగురు జవాన్లు మరణించారు. అనాటి నుంచి ఏవోబీ సరిహద్దుల్లో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే.