న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన ఓ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు 17 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. 18 మంది భద్రతా సిబ్బందిపై ఆరోపణలు రాగా ఒకరు మాత్రం కేసు నుంచి బయటపడ్డారు. నిందితులకు సీబీఐ కోర్టు శనివారం శిక్షలను ఖరారు చేసే అవకాశముంది.
ఉత్తరాఖండ్లోని డూన్లో 2009లో రణ్బీర్ అనే ఎంబీఏ విద్యార్థిని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చిచంపారు. ఎలాంటి నేరం చేయని రణ్బీర్ ను చంపడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్పై బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం 17 మందిపై హత్య, కిడ్నాప్, కుట్ర అభియోగాలు రుజువయ్యాయి.
కోర్టు తీర్పు అనంతరం రణ్బీర్ తండ్రి మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వల్ల తన కొడుకు తిరిగిరాడని, ఆ నష్టం పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల ఇలాంటి నేరాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు.