ఆర్కే, రవిలను విడుదల చేయాలి | Malkangiri killings fake encounter of Naxals, says Varavara Rao | Sakshi
Sakshi News home page

ఆర్కే, రవిలను విడుదల చేయాలి

Published Fri, Oct 28 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ఆర్కే, రవిలను విడుదల చేయాలి

ఆర్కే, రవిలను విడుదల చేయాలి

వరవరరావు డిమాండ్
హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామకృష్ణ (ఆర్కే) అలియాస్ సాకేత్ అలియాస్ రాజన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, దుబాషి శంకర్ అలియాస్ అంకమ్‌బాబురావు అలియాస్ మహేందర్ తదితరులను వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. వీరందరినీ బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వారిని కోర్టులో హాజరు పరచాలన్నారు. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ప్రభాకర్ మృతదేహానికి గురువారం యాప్రాల్‌లో వరవరరావు జోహార్లు అర్పించారు.
 
అడవి సంపదను దోచుకోవడానికే...
ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రపంచ బ్యాంక్ ఎజెండాగా పనిచేస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్‌కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ను కుట్రగా అభివర్ణించారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. ఇందులో కానిస్టేబుల్ మృతికి కాల్పులు కారణం కాదని.. కాలువలో పడి చనిపోయాడన్నారు. ఆదివాసీలపై ఎలాంటి కేసులూ పెట్టే అర్హత ప్రభుత్వాలకు లేదని, ఇప్పటికై నా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు కూంబింగ్‌లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

పీడిత ప్రజలున్నంతకాలం విప్లవం...
పీడిత తాడిత ప్రజలున్నంత వరకు విప్లవ ఉద్యమాలు ఆగవని వరవరరావు స్పష్టం చేశారు. ఆదివాసీల దీర్ఘకాలిక సమస్యలపై మావోయిస్టు పార్టీ 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు.

కేసీఆర్ ప్రకటన చేయాలి: గద్దర్
విప్లవకారుల ఎన్‌కౌంటర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పీడీఎం రాష్ట్ర  అధ్యక్షుడు రాజు, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు ప్రభాకర్ మృతదేహానికి జోహార్లు అర్పిం చారు. బూటకపు ఎన్‌కౌంటర్లతో నక్సలిజాన్ని ఆపలేరని, మావోయిస్టుల అడ్డుతొలిగితే మార్గం సులువు చేసుకోవచ్చని చంద్రబాబునాయుడు కలలు కంటున్నాడని విమలక్క అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటాలను ఆపేదిలేదన్నారు.

ఈ ఎన్‌కౌంటర్ వట్టి బూట కమని, పోలీసుల నాటకమని ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత క్రూరం గా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం మన్యం గిరి జనుల కడుపు నింపే అడవుల కింద కోట్లాది రూపాయల విలువచేసే బాకై ్సట్ ఖనిజం తవ్వకాల కోసమే బడా వ్యాపారవేత్తలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాయని రాజు ఆరోపించారు. ప్రొఫెసర్ కాశీం, స్నేహలత, చంద్రమౌళి, అంద్శై నలమాస కృష్ణ తదితరులు ప్రభాకర్‌కు నివాళులర్పించారు.  
 
ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి
‘దోపిడి రాజ్యాన్ని కూల్చడానికి అడవిబాట పట్టి పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోతివా... కొడుకా ప్రభాకరా.. ఎంత పని చేస్తిరి... నీ పాట ఎటుపోయె కొడుకా... తెలంగాణ కోసం మధనపడితివి. నా ప్రాణం అంటివి. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయంటివి. దోపిడి రాజ్యాన్ని మారుద్దామంటివి. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి. మీ నాయన పోయినా రాకపోతివి. మాకు ఎవరు తోడుంటరు కొడుకా’ అంటూ ప్రభాకర్ తల్లి రత్నమ్మ గుండెలవిసేలా రోదించారు.
 
కూంబింగ్ నిలిపివేయాలి...
దండకారణ్యంలో కూంబింగ్‌ను నిలిపివేయాలి. సమాజంలో ఆర్థిక అసమానతలున్నంత కాలం నక్సలిజం ఉంటుంది. - ప్రభాకర్ సహచరి దేవేంద్ర 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement