Varavararavu
-
ఆర్కే, రవిలను విడుదల చేయాలి
వరవరరావు డిమాండ్ హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామకృష్ణ (ఆర్కే) అలియాస్ సాకేత్ అలియాస్ రాజన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, దుబాషి శంకర్ అలియాస్ అంకమ్బాబురావు అలియాస్ మహేందర్ తదితరులను వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. వీరందరినీ బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వారిని కోర్టులో హాజరు పరచాలన్నారు. మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మృతిచెందిన ప్రభాకర్ మృతదేహానికి గురువారం యాప్రాల్‌లో వరవరరావు జోహార్లు అర్పించారు. అడవి సంపదను దోచుకోవడానికే... ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రపంచ బ్యాంక్ ఎజెండాగా పనిచేస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ను కుట్రగా అభివర్ణించారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. ఇందులో కానిస్టేబుల్ మృతికి కాల్పులు కారణం కాదని.. కాలువలో పడి చనిపోయాడన్నారు. ఆదివాసీలపై ఎలాంటి కేసులూ పెట్టే అర్హత ప్రభుత్వాలకు లేదని, ఇప్పటికై నా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు కూంబింగ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పీడిత ప్రజలున్నంతకాలం విప్లవం... పీడిత తాడిత ప్రజలున్నంత వరకు విప్లవ ఉద్యమాలు ఆగవని వరవరరావు స్పష్టం చేశారు. ఆదివాసీల దీర్ఘకాలిక సమస్యలపై మావోయిస్టు పార్టీ 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రకటన చేయాలి: గద్దర్ విప్లవకారుల ఎన్కౌంటర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు ప్రభాకర్ మృతదేహానికి జోహార్లు అర్పిం చారు. బూటకపు ఎన్కౌంటర్లతో నక్సలిజాన్ని ఆపలేరని, మావోయిస్టుల అడ్డుతొలిగితే మార్గం సులువు చేసుకోవచ్చని చంద్రబాబునాయుడు కలలు కంటున్నాడని విమలక్క అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటాలను ఆపేదిలేదన్నారు. ఈ ఎన్కౌంటర్ వట్టి బూట కమని, పోలీసుల నాటకమని ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత క్రూరం గా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం మన్యం గిరి జనుల కడుపు నింపే అడవుల కింద కోట్లాది రూపాయల విలువచేసే బాకై ్సట్ ఖనిజం తవ్వకాల కోసమే బడా వ్యాపారవేత్తలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాయని రాజు ఆరోపించారు. ప్రొఫెసర్ కాశీం, స్నేహలత, చంద్రమౌళి, అంద్శై నలమాస కృష్ణ తదితరులు ప్రభాకర్‌కు నివాళులర్పించారు. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి ‘దోపిడి రాజ్యాన్ని కూల్చడానికి అడవిబాట పట్టి పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోతివా... కొడుకా ప్రభాకరా.. ఎంత పని చేస్తిరి... నీ పాట ఎటుపోయె కొడుకా... తెలంగాణ కోసం మధనపడితివి. నా ప్రాణం అంటివి. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయంటివి. దోపిడి రాజ్యాన్ని మారుద్దామంటివి. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి. మీ నాయన పోయినా రాకపోతివి. మాకు ఎవరు తోడుంటరు కొడుకా’ అంటూ ప్రభాకర్ తల్లి రత్నమ్మ గుండెలవిసేలా రోదించారు. కూంబింగ్ నిలిపివేయాలి... దండకారణ్యంలో కూంబింగ్‌ను నిలిపివేయాలి. సమాజంలో ఆర్థిక అసమానతలున్నంత కాలం నక్సలిజం ఉంటుంది. - ప్రభాకర్ సహచరి దేవేంద్ర -
ఆర్కే ఎక్కడ?
►క్షేమంగానే ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నట్లు! ► కొడుకు, గన్మెన్లు ఎన్కౌంటర్లో మృత్యువాత ►ఆర్కేపోలీసుల అదుపులోనే ఉన్నారంటున్న వరవరరావు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్.. రోజురోజుకీ పెరుగుతున్న మావోల మృతుల సంఖ్య.. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారా?.. తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారా?.. అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏవోబీలో వరుసగా ఐదురోజుల్లో మూడు ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు చెప్పడం, ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ప్రకటిస్తుండటంతో ఖాకీ వ్యూహం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వందలు దాటి ఇప్పుడు వేలాదిమంది పోలీసులు ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఆర్కే లక్ష్యంగానే పోలీసులు భారీగా కూంబింగ్ చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సోమవారం జరిగిన ఎన్కౌంటర్ ఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నారని గత నాలుగు రోజులుగా వినిపిస్తున్న వాదనలకు భిన్నంగా విరసం నేత వరవరరావు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని, వెంటనే ఆయన్ని కోర్టులో హాజరుపరచాలని వరవరరావు గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఐదురోజులైనా ఆర్కే క్షేమంగా ఉన్నట్టు ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం ఆందోళన రేకిత్తిస్తోంది. హెలికాప్టర్లతో జల్లెడ... మరో పక్క పోలీసు అధికారులు మాత్రం ఆర్కే తమ అదుపులో లేరని చెబుతున్నారు. గాలింపు చర్యలు మాత్రం తీవ్రతరం చేశామని అంగీకరిస్తున్నారు. సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లను వినియోగించని పోలీసులు.. గత రెండు రోజులుగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేస్తున్నారు. బలిమెల బ్యాక్ వాటర్ ప్రాంతంలో కూడా నిఘా పెంచారు. గాయాలపాలైన ఆర్కేకు ఆర్ఎంపీ లేదా ఇతర ప్రైవేటు వైద్యుల సేవలు అందకుండా చర్య లు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏజెన్సీలోని వైద్యులపై ఆంక్షలు విధిస్తున్నారు. ఏవోబీలో మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆర్కేను అంతమొందిస్తే పార్టీ పూర్తిగా నిర్వీర్యమవుతుందన్న అంచనాతోనే పోలీసులు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కే అడవిలోనే సురక్షితంగా ఉన్నాడా, తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతున్నాడా, పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్టు పోలీసుల చెరలో ఉన్నాడా అనేది అంతుబట్టకుండా ఉంది. ఆ మందులు అతనికేనా! గురువారం విశాఖ జిల్లా సిర్లిమెట్ట వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందగా, వారి నుంచి కొన్ని మందులు(ఇంజక్షన్లు, మాత్రలను) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చూపించారు. ఆ మందులు అనారోగ్యంతో ఉన్న ఆర్కే కోసమేనా.. అన్న వాదనలు తెరపైకి వచ్చాయి. సోమవారం పోలీసుల కాల్పుల్లో ఆర్కేకి కూడా తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో ఆయన్ను కొందరు దళ సభ్యులు సంఘటన ప్రాంతం నుంచి మోసుకువెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం సిర్లిమెట్ట వద్ద మావోలు పోలీసులకు చిక్కి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ కోణంలోనే పౌరహక్కుల సంఘాల నేతలు, విరసం నేత వరవరరావు తదితరులు ఆర్కే కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు అనుమానిస్తున్నారని అంటున్నారు. -
ఎన్కౌంటర్ కాదు.. మారణకాండ
► దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి ► విరసం నేత వరవరరావు సాక్షి, విశాఖపట్నం: మల్కన్‌గిరి అటవీ ప్రాంతంలో జరిగినది ఎన్కౌంటర్ కాదని.. మారణకాండని విరసం నేత వరవరరావు ఆరోపించారు. 27 మంది మావోయిస్టులను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు డీజీపీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఎన్కౌంటర్ మృతుల బంధు, మిత్రులతో కలసి విశాఖ వచ్చారు. దివంగత విప్లవనేత చలసాని ప్రసాద్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు సమావేశమవుతున్నారన్న సమాచారంతో డీజీపీ ఆదేశాల మేరకే వారిని మట్టుబెట్టారని, ఎన్కౌంటర్లో కాదని చెప్పారు. ఎదురుకాల్పుల్లో గ్రేహౌం డ్స్ కానిస్టేబుల్ అబూబకర్ చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారని, కానీ ఆయన ట్రక్కు బోల్తా పడిన ఘటనలో మరణించాడన్నారు. పోలీసులు చెబుతున్న పేర్లకు, చనిపోయిన వారి ముఖాలకు పొంతనలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్క ఆర్కే కుమారుడు మున్నా మృతదేహం ఫొటో మాత్ర మే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతదేహాన్ని చూపడం లేదని, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటరమణ, అతని భార్య, అరుణల మృతదేహాలు కనిపించకపోవడంతో అసలు వీరు మరణిం చారో.. లేదో.. అనే సందేహాన్ని వ్యక్తంచేశారు. మృతదేహాలను కేజీహెచ్‌లో భద్రపరచి బంధువులకు అప్పగించాలన్నారు. -
విజయ్ ని కోర్టులో హాజరుపరచాలి: వరవరరావు
వరంగల్ కేసీఆర్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాలు తెలిపాయి. విజయ్ తో పాటు అతని తల్లి దండ్రులు కూడా పోలీసులు పట్టుకెళ్లారని.. పేర్కొన్నారు. వెంటనే విజయ్, అతడి తల్లి దండ్రులను పోలీసులు కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. కాగా.. విజయ్ కి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వాదిస్తున్నారు. మరో వైపు కేసీఆర్ సభలో నిరసన తెలిపి నందుకే పోలీసులు విజయ్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితలసంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పోలీసులు మనువాడ విజయ్ ని అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా తమ కస్టడీలో పెట్టుకున్న మనువాడ విజయ్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
మూగబోయిన ‘లాల్బనో’ గళం - ఎన్.కె.
ఎన్.కెగా 1970 నుంచి విప్లవ సాహిత్యోద్యమానికి పరిచయ మైన నెల్లుట్ల కోదండరామారావు వరంగల్ జిల్లా కూనూరులో ఒక సంప్రదాయ దేశ్‌ముఖ్ కుటుం బంలో జన్మించారు. ఇటు సాహి త్య ప్రభావం, అటు తెలంగాణ ఉద్యమ వాతావరణంలో ఎన్‌కె వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో ఒక చిరు ఉద్యోగిగా మిత్రమండలికి వచ్చేవాడు. ఆయన కన్నతండ్రి పద్యాలై నా, అప్పుడప్పుడే రాస్తున్న కవితలైనా ఎవరివైనా సరే ఆయన చూసి చదివింది ఎప్పుడూలేదు. అన్నీ కంఠతా అద్భుతమైన స్వరంతో చదివేవాడు. మిత్ర మండలిలో కాళోజీ సోదరులకు, ఇతర సాహితీమిత్రులకు, సృజన ‘సాహితీమిత్రులకు’ ఆయనట్లా సన్నిహితమయ్యాడు. అదే కాలంలో సృజనలో ‘ట్రిగ్గర్ మీది వేళ్లతో.. ’లోచన్ కవిత, 69 నాటికి శివసాగర్ ‘లెనిన్-నా లెనిన్’ వంటి కవితలు, శివసాగర్ ‘జేగంటలు’, ‘తూర్పుపవనం వీచెనోయ్’ వంటి పాటలు ఎన్కెను ఆవహించి ఆయన నింక విప్లవోద్యమం నుంచి వెనక్కి చూడకుండా చేసినవి. సృజన సాహితీమిత్రుల్లో రచనల ఎన్నిక విషయం లోనే కాదు, ప్రెస్‌లో ప్రూఫులు చూడడం మొదలు, ఇంట్లో మనిషి వలె తలకెత్తుకున్నవాడు ఎన్‌కె. మూడు నాలుగేళ్లు గా పార్కిన్సన్,, మధుమేహం, రక్తపోటుతో బాధపడు తూ, గుండెజబ్బుకు కూడా శస్త్ర చికిత్స జరిగి చూపు, నడక దాదాపు కోల్పోయి అనారోగ్యంతో శయ్యాగతుడుగానే ఉన్నాడు. ఆఖరిసారి ఈ సెప్టెంబర్ 7న కాళోజీపై లోచన్ పుస్తకావిష్కరణకు వెళ్లి, ఆయనను వెళ్లి చూసినప్పుడు మాత్రం కొంచెం మెరుగ్గా ఉన్నట్టు అనిపించింది. ఆయన మళ్లీ కంఠం సవరించుకొని మనమధ్యకు వచ్చి ఆ 70ల, 80ల రోజులను ఆలపించగలడనే ఆశ నిన్న 2014 డిసెంబర్ 27 రాత్రి 8గంటలకు శాశ్వతంగా విగత ఆశ అయిపోయింది. ఎన్‌కె జీవితంలో 1968-85 ఒక ఉజ్వల కాలం. ముఖ్యంగా వరంగల్‌లో 85 సెప్టెంబర్ 3న డాక్టర్ రామనాథం గారి హత్యతో మేం పదిహేడేళ్లు ఒక గూటి పక్షులుగా పంచుకున్న జీవితాలు, ఉద్యమా లు అన్నీ చెల్లాచెదురయిపోయినవి. కొంద రు కూడదీసుకున్నారు. 1985-89 గడ్డుకా లాన్ని గడిచి మునుసాగారు. కాని ఎన్‌కె విరసం క్రమశిక్షణా నియమాల వల్ల కూడా 1990 నాటికి విరసం నుంచి నిష్ర్కమిం చాడు. అయితే హృదయంలో విప్లవం పట్ల, విప్లవసాహిత్యం పట్ల గూడుకట్టుకున్న భావాద్వేగాలు ఎప్పుడూ చెదిరిపోలేదు. 1985 దాకా విరసం కార్యకలాపాల్లో చాలా క్రీయాశీ లంగా పాల్గొన్న ఎన్‌కె 70లో ఖమ్మంలో కామ్రేడ్ సుబ్బా రావు పాణిగ్రాహినగర్లో జరిగిన ప్రథమ మహాసభల నుంచి వరంగల్, హైదరాబాద్, తెనాలి, గుంటూరు, విశాఖపట్నంల దాకా వేదికలపై విప్లవగీతాల ఆలాపనల తో చాలా ప్రసిద్ధుడయ్యాడు. అప్పుడు విరసం సభలకు వేలాది మందిగా జనం వచ్చేవాళ్లు. ఎమర్జెన్సీ ప్రకటించగానే 1975 జూలై 4న ఆయనను మీసా కింద అరెస్టు చేశారు. 75 అక్టోబరు 1 దాకా జైలులో మా గదిలోనే ఉన్న చెరుకూరి రాజకుమార్‌తో కలిసి ఎప్పుడూ ఆయన విప్లవగీతాలు ఆలపిస్తుండేవాడు. ఎమ ర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విప్లవోద్యమం ప్రజాపంథాను చేపట్టాక మాకు జన్నుచిన్నాలు తలలో నాలుకయ్యాడు. 1979 అక్టోబర్ 19న జన్ను చిన్నాలు హత్య జరిగినప్పుడు ‘‘నీ కోసం పాట పాడుతా చిన్నాలన్నా, ఒక్కసారి లేచిరా వయ్యా చిన్నాలన్నా’’ అని ఆయన పాడిన పాట ఎన్ని సభల్లో మారుమ్రోగేదో. సృజనలో 1982 ఆగస్టులో అచ్చయిన ‘లాల్బనో గులామీ చోడో బోలో వందేమా తరమ్’ అనే ఎన్‌కె దీర్ఘకవిత 1983లో ఒకసారి, 84లో మళ్లీ అంతే సుదీర్ఘమైన బాలగోపాల్ ముందు మాటతో ఆర్ఎస్యూనే ప్రచురించి, విస్తృత ప్రచారం చేసింది. ఈ కవితకు ఒక చరిత్ర ఉంది. నక్సలైట్లు ఏ దేశ భక్తులు, చైనా చెంచాలు, రష్యా తొత్తులు అని గోడల మీద ఏబీవీపీ వాళ్లు నినాదాలు రాస్తే ‘నక్సలైట్లే దేశభక్తులు’ అని రాడికల్స్ రాసిన రోజులవి. ‘లాల్గులా మీ చోడ్కే బోలో వందే మాతరమ్’ అని ఏబీవీపీ వాళ్లు రాస్తే దానికి ముహ్‌తోడ్ జవాబివ్వాలని ఆవేశపడిన ఎన్‌కె ఏకంగా ఒక దీర్ఘకవితను వేలాది మంది ప్రేక్షకుల ముందు కంచుకంఠం మోగినట్లు అరమోడ్పు కన్నులతో పాడుతుం టే అది ఓ రోమాంచి తదృశ్యం. ఒక ఉద్రిక్త అనుభవం. జమ్మి కుంట ఆదర్శ కళాశాల విద్యార్థి తిరుపతి పోలీసుల చిత్రహింసలకు గురై తర్వాత కొద్ది రోజులకే కరెంటు షాక్‌తో మరణించినప్పుడు ఆయనపై ఎన్‌కె రాసిన పాట చాలా ప్రచారాన్ని పొందింది. తిరుపతిలో విప్లవోద్య మాన్ని నిర్మించిన చలపతి, నాగరాజుల లో నాగరాజు అమరుడైనప్పుడు ‘అంటాము అమరు డవని నాగరాజు, ఉంటాము నీవెంట రోజురోజు’ అని రాసిన పాట ఇప్పటికీ విప్లవ విద్యార్థి ఉద్యమం గుర్తు పెట్టుకుంటుంది. 68 నుంచి 85 దాకా ఆయన మా ఇంట్లో పెద్ద కొడుకు వలె వ్యవహరించాడు. నన్ను చిన్నబాపు అని, నా సహచరి హేమలతను చిన్నమ్మ అని పిలిచేవాడు. ఆమెను కూడా కన్నతల్లి అంతగా అభిమానించాడు. ఇంట్లో పిల్లల వలెనే అలకలు, కోపాలు, ఉద్రేకాలు, అపార్థాలు, సాధించడాలు - మళ్లా కరిగిపోవడాలు అన్నీ ఉండేవి. 1990 తర్వాత మాకు పరస్పరం ప్రేమాభిమానాల్లో ఏ కల్మషమూ రాలేదు గానీ ఆయన విరసంకు దూరమ య్యాడు. ‘అమ్మమనసు’ వస్తుగత దృష్టితో కాకుండా స్వీయాత్మక దృష్టితో రాసాడనిపించింది. విరసం నిర్మా ణం, కార్యకలాపాల పట్ల కూడా కొన్ని తప్పులు దొర్లాయి. కనుక అవి సవరించుకొని మళ్లీ రాయమన్నాను. అంతే. ఆ పుస్తకానికి ముందు మాటలో ఆ అలక, కోపం, బాధ, వేదన కనిపిస్తాయి. కానీ ప్రేమలున్నచోట అవన్నీ కన్నీళ్ల లో కరిగిపోతాయి కంట్లో నలుసులు కరిగి పోయినట్లుగా, చినబాపూ, చిన్నమ్మా, చెల్లెళ్లూ, తమ్ములూ అని ఆయన నాభి దగ్గర్నించి వచ్చే పిలుపు, గాలిలో తేలిపోయే ఆయన పాటలు మా చెవుల్లో మోగుతూనే ఉంటాయి. గుండెల్లో తడిగా మిగిలి ఉంటాయి. ఇవన్నీ విప్లవానుబంధం వల్ల, సృజన వల్ల, విరసం వల్ల ఏర్పడినవే. కనుక మరింత స్వచ్ఛమైనవి. (వ్యాసకర్త విప్లవ కవి, విరసం నేత)