ఎన్‌కౌంటర్ కాదు.. మారణకాండ
► దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి
► విరసం నేత వరవరరావు
సాక్షి, విశాఖపట్నం: మల్కన్‌గిరి అటవీ ప్రాంతంలో జరిగినది ఎన్‌కౌంటర్ కాదని.. మారణకాండని విరసం నేత వరవరరావు ఆరోపించారు. 27 మంది మావోయిస్టులను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు డీజీపీపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఎన్‌కౌంటర్ మృతుల బంధు, మిత్రులతో కలసి విశాఖ వచ్చారు. దివంగత విప్లవనేత చలసాని ప్రసాద్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు సమావేశమవుతున్నారన్న సమాచారంతో డీజీపీ ఆదేశాల మేరకే వారిని మట్టుబెట్టారని, ఎన్‌కౌంటర్‌లో కాదని చెప్పారు. ఎదురుకాల్పుల్లో గ్రేహౌం డ్స్ కానిస్టేబుల్ అబూబకర్ చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారని, కానీ ఆయన ట్రక్కు బోల్తా పడిన ఘటనలో మరణించాడన్నారు.
పోలీసులు చెబుతున్న పేర్లకు, చనిపోయిన వారి ముఖాలకు పొంతనలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్క ఆర్కే కుమారుడు మున్నా మృతదేహం ఫొటో మాత్ర మే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతదేహాన్ని చూపడం లేదని, రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటరమణ, అతని భార్య, అరుణల మృతదేహాలు కనిపించకపోవడంతో అసలు వీరు మరణిం చారో.. లేదో.. అనే సందేహాన్ని వ్యక్తంచేశారు. మృతదేహాలను కేజీహెచ్‌లో భద్రపరచి బంధువులకు అప్పగించాలన్నారు.