
అహ్మదాబాద్ : అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్, రాజస్థాన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఫేక్ ఎన్‌కౌంటర్‌లో చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘ పదేళ్ల క్రితం కేసును ఇప్పుడు తిరగదోడుతున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు నన్ను వేధిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే నా ప్రయత్నం. చట్టాన్ని గౌరవిస్తా.. త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోతాను’ అని తొగాడియా ప్రకటించారు. తనకేం జరిగినా ప్రభుత్వాలదే బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
అయోధ్య రామ మందిరం, గో వధ నిషేధ చట్టం తదితర అంశాలపై మాట్లాడుతున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా హిందు సమాజ శ్రేయస్సు కోసం తాను చేసే కృషిని ఎవరూ అడ్డుకోలేరని తొగాడియా వ్యాఖ్యానించారు.
సోమవారం మధ్యాహ్నాం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి.. రాజస్థాన్ పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆయన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యక్షం కావటం విశేషం. షుగర్ లెవల్స్ పడిపోవటంతో షాహిబాగ్‌లోని ఓ పార్క్‌లో స్పృహ కోల్పోయి పడిపోగా.. స్థానికులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు వైద్యులు వెల్లడించారు.