
ఎన్‌కౌంటర్‌పై హెడ్ కానిస్టేబుల్ సంచలన ప్రకటన
ఇఫాంల్: ఆరు సంవత్సరాల కిందట జరిగిన పీఎల్‌ఏ మాజీ ఉగ్రవాది ఎన్‌కౌంటర్ ఘటనపై మణిపూర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ సంచలన ప్రకటన చేశాడు. తనపై అధికారి ఆదేశించడంతో ఉగ్రవాది సంజిత్ మెయితీని నకిలీ ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్టు అతను అంగీకరించాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ కానిస్టేబుల్ హిరోజిత్ సింగ్ ఈ మేరకు వెల్లడించాడు. 2009లో నిరాయుధుడైన మెయితీపై 9ఎంఎం పిస్తోల్‌తో బుల్లెట్ల వర్షం కురిపించానని, ఛాతిలోకి బుల్లెట్లు దిగడంతో అతను కుప్పకూలాడని హిరోజిత్ చెప్పాడు. ఇంఫాల్ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకే తాను ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్టు తెలిపాడు.
ఈ ఘటన గురించి మణిపూర్ డీజీపీ, ముఖ్యమంత్రికి కూడా తెలుసనని చెప్పాడు. ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. హిరోజిత్ వ్యాఖ్యలపై సంజిత్ మెయితీ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిరోజిత్‌ను కఠినంగా శిక్షించాలని, లేదా తన కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతన్ని తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేసింది. 2009లో అనుమానిత ఉగ్రవాదిగా అరెస్టైన సంజిత్ మెయితీని పోలీసులు చంపడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తలు రేపింది. యువకుడిని అన్యాయంగా పోలీసులు పొట్టనబెట్టుకున్నారని మణిపూర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.