అధికారుల వైఫల్యంతోనే తొక్కిసలాట
మీడియాతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల: తిరుపతిలోని బైరాగిపట్టెడలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై చింతించడం తప్ప చేసేదేమీ లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘పొరపాటు జరిగిపోయింది. చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదు’ అన్నారు. అధికారుల వైఫల్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు.
ఒక సెంటర్‌లో భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించారని.. దీంతో తొక్కిసలాట జరిగి భక్తులు మృతిచెందినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని తెలిపారు. మరో 20, 25 మంది వరకు క్షతగాత్రులు రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
సీఎం అసహనం వ్యక్తం చేశారు
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు తనతోను, టీటీడీ అధికారులతోను మాట్లాడారని బీఆర్ నాయుడు తెలిపారు. ఘటనపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అధికారుల వైఫల్యంతోనే ఇటువంటి ఘటన చోటుచేసుకుందని, అధికారులు చాలా ఈజీగా తీసుకున్నారని సీఎం పేర్కొన్నారన్నారు. సీఎంవో, డీజీపీ కార్యాలయాలు సైతం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాయని వెల్లడించారు. పరిస్థితిని ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
ఇందులో ఎటువంటి కుట్ర లేదని.. ప్రమాదవశాత్తు మాత్రమే దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం తిరుపతి వస్తున్నట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment