గంగవ్వ గుడిసె స్థానంలో నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూం ఇల్లు
అసలే వృద్ధాప్యం.. ఆపై మనవరాళ్ల భారం.. పైగా పేదరికం.. వారినెలా పోషించాలో తెలియని అయోమయస్థితి. ఇద్దరు వృద్ధురాళ్ల దీనస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలు ఆ కలెక్టర్‌ను కదిలించాయి. గూడు చెదిరిన పక్షుల గోడుకు ఆయన స్పందించారు.. ఆపద్బంధుగా నిలిచారు.. కొడుకులు, కోడళ్లు తమ కళ్లముందే చనిపోయి ఒంటరిగా తల్లడిల్లుతున్న పేదతల్లులకు పెద్దకొడుకులా నిలిచారు. ఒకరికి డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించి ఇచ్చారు. మరొకరి ఇంటి మీద ఉన్న బ్యాంకురుణం తీర్చి గూడు నిలబెట్టారు. ఆయనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్.
– సాక్షి, కామారెడ్డి
చలించి.. చేయూతనిచ్చి..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్‌కి చెందిన కరిమంచి గంగవ్వ కొడుకు, కోడలు కొద్దిరోజుల క్రితం చనిపోయారు. వారి ముగ్గురు పిల్లలను పోషించాల్సిన బాధ్యత గంగవ్వపై పడిం ది. పొద్దున్నే చలిబువ్వ అడు కొచ్చి ఇద్దరు పిల్లలకు తినిపించేది. తర్వాత తాను కామారెడ్డి బస్టాండ్‌కు చేరుకుని భిక్షాటన చేస్తుండేది. గంగవ్వ దీనస్థితిని గమనించిన ‘సాక్షి’గతేడాది ఫిబ్రవరి 15న ‘ఫ్యామిలీ’పేజీలో ‘ముగ్గు రు పిల్లలు... నాయనమ్మ’అనే కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి కలెక్టర్ శరత్ చలించిపోయారు. అదేరోజు గంగవ్వను, పిల్లల్ని తన కార్యాలయానికి పిలిపించి తక్షణమే రూ.50 వేల సాయం అందించారు. పెద్ద మనవరాలు చామంతికి ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగం కల్పించారు. మిగతా పిల్లల చదువుకు ఆసరా అవుతానని భరోసా ఇచ్చారు. పూరిగుడిసెలో నివసిస్తున్న గంగవ్వకు డబుల్ బెడ్‌రూం పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చారు. కలెక్టర్ తనకు పెద్ద కొడుకు లెక్క ఆదుకున్నరని, తన కుటుంబ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి రుణపడి ఉంటామని గంగవ్వ అంటోంది.
అప్పుతీర్చి.. ఇల్లు నిలబెట్టారు...
కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన బీమరి రాజేశ్(35), ఆయన భార్య స్రవంతి (31) ఇటీవల కరోనా బారిన పడి చనిపోయారు. దీంతో రాజేశ్ తల్లి సిద్ధవ్వ, అతని ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు. పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలంటూ సిద్ధవ్వ రోదిస్తున్న క్రమంలో రాజేశ్ కట్టిన ఇంటిపై రూ.18లక్షల అప్పు ఉందని బ్యాంకు నుంచి పిడుగులాంటి నోటీసు వచ్చింది. తెలిసిన వారినల్లా కలిసి కాళ్లావేళ్లా పడింది. అయినా అప్పు పుట్టలేదు. ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిద్ధవ్వ కుటుంబ పరిస్థితిపై మే 30న ‘సాక్షి’ ప్రధాన సంచికలో (‘కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’) అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ శరత్ స్పందించారు.
సిద్ధవ్వకు నెలకు రూ.5వేల వేతనం వచ్చేలా ఉద్యో గం ఇప్పించారు. కలెక్టర్ చొరవతో బ్యాంకు అధికారులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రుణంలోంచి రూ.8 లక్షలు తగ్గించారు. ‘సాక్షి’ కథనాన్ని చదివిన పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కలెక్టర్‌ను కలిసి సాయం చేస్తామని ముందుకువచ్చారు. వారితోపాటు వివిధ వర్గాల ద్వారా సేకరించిన డబ్బులతో బ్యాంకు అప్పు తీర్చి సిద్ధవ్వను రుణవిముక్తి చేశారు. కలెక్టర్‌కు, సాక్షికి సిద్ధవ్వ కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment