![Telangana: Plot Owners Get Rs 3 Lakh From Govt For House Construction - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/8/HOUSE-5.jpg.webp?itok=m7KnFaYl)
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం కొత్త రూపు సంతరించుకోనుంది. ఇప్పటివరకు ప్రభుత్వమే గుర్తించిన స్థలాల్లో అపార్ట్‌మెంటుల తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇకపై ఆ తరహా ఇళ్లకు బదులు, లబ్ధిదారులే వారికున్న సొంత స్థలాల్లో వ్యక్తిగత ఇళ్లుగా నిర్మించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తరహాలో.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది.
వాస్తవానికి 2014లోనే మేనిఫెస్టోలో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కానీ ఆ తర్వాత అది ఇప్పటివరకు అమలైన ఇళ్ల నిర్మాణం మోడల్‌లోకి మారింది. ఈ తరహాలో ఎన్నో సమస్యలు ఎదురై, పథకం సాఫీగా సాగని పరిస్థితి నెలకొనడంతో.. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న రీతిలో వ్యక్తిగత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనికి తాజా బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు చొప్పున 3.57 లక్షల ఇళ్లను నేరుగా కేటాయించనుండగా, ముఖ్యమంత్రి ఖాతాలో మరో 43 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. వెరసి మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది.
పాత పథకానికి పీఎంఏవై నిధులు
తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.12 వేల కోట్లు.. సొంత స్థలాలున్న వారికి మంజూరయ్యే ఇళ్లకే సరిపోనున్నాయి. మరి ఇప్పటివరకు అమలులో ఉన్న పద్ధతిలో కొనసాగుతున్న ఇళ్లకు నిధుల మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల వరకు మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ నిధులను రెగ్యులర్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment