అనూహ్య ఘటన.. భట్టి ఇంటికి తలసాని | Minister Talasani Srinivas Went To Bhatti Vikramarka Home Accept Challenge | Sakshi
Sakshi News home page

భట్టి సవాలును స్వీకరించిన తలసాని

Published Thu, Sep 17 2020 11:02 AM | Last Updated on Thu, Sep 17 2020 2:11 PM

Minister Talasani Srinivas Went To Bhatti Vikramarka Home Accept Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో గురువారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క విసిరిన సవాలును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వీకరించారు. మహానగరంలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరిపితే తమనకు చూపించాలని భట్టి డిమాండ్‌ చేయగా.. దానికి తలసాని అంగీకరించారు. దీంతో గురువారం ఉదయం మంత్రి తలసాని అధికారులతో నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను చూపిస్తామని తమతో రావాలని డిమాండ్‌ చేశారు. దీనికి అంగీకరించిన భట్టి, తలసానితో కలిసి ఒకే కారులో బయలుదేరారు. అయితే తొలుత మంత్రిని చూసి షాక్‌ అయిన భట్టి.. తలసానిని సాదరంగా లోపలకి ఆహ్వానించారు. ఇద్దరు కలిసి కాసేపు సరదాగా చర్చించుకుని అనంతరం బయలుదేరి వెళ్లారు. అధికారులతో కలిసి ఇద్దరూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించనున్నారు. (మేం గొప్పలు చెప్పం.. చేసి చూపిస్తాం)


అసలు ఏం జరిగింది.. 
రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడేందుకు కొద్దినిమిషాల ముందు కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల మధ్య వాడీవేడీ వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు భట్టి కౌంటర్‌ చేయడం, దాన్ని తప్పుపడుతూ మంత్రులు వ్యాఖ్యలు చేయడంతో కొద్దిసేపు సభ వేడేక్కింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని భట్టి చెబితే..తెలంగాణ మాటెత్తే అర్హత లేదని మంత్రులు తీవ్ర స్ధాయిలో విరుచుకుపడటంతో కొద్దిసేపు సభ వాడివేడిగా సాగింది.


షురూ అయిందిలా...
గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా ఇతర  పట్టణాల్లో అభివృధ్ధి పనులు, మౌలిక వసతులపై బుధవారం సభలో చర్చ సందర్భంగా హైదరాబాద్‌ అభివృధ్ధి అంతా తమ చలవేనని, టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదంటూ, రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ సభ చివరలో ప్రస్తావించారు. రాష్ట్రం ఏమీ దివాళా తీయలేదని, కాంగ్రెస్‌ పార్టీనే దివాళా తీసిందని, త్వరలోనే గాంధీభవన్‌కు టులెట్‌ బోర్డు పెట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో నిరుద్యోగం పెరిగిందని, వారి హయాంలో మాదిరి ప్రస్తుత ప్రభుత్వంలో ధర్నాలు, ఖాళీ కుండల ప్రదర్శనలు లేవని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌ ఇచ్చిన భట్టి, ‘కాంగ్రెస్‌ హయాంలో ధర్నాలున్నాయి కాబట్టే ప్రజాస్వామ్యయుతంగా సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ ఇప్పుడు ధర్నాలు ఎక్కడ చేయనిస్తున్నారు. పోలీసు కట్టడితో ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయిస్తున్నారు. పోలీసులు లేకుండా వందల సంఖ్యలో అసెంబ్లీ ముందు ధర్నాలుండేవి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ధర్నా చౌక్‌ ఎత్తేశారు’ అని పేర్కొన్నారు.

దీనికి అధికార సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్‌ సైతం దీనికి అభ్యంతరం చెప్పారు. అయిన తన ప్రసంగాన్ని కొనసాగించిన భట్టి, ‘గాంధీభవన్‌ గూర్చి చులకనగా మాట్లాడుతున్నారు. గాంధీభవనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. గాంధీభవన్‌ ఉంది కావునే అసెంబ్లీలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడే బిల్లు పెట్టిచ్చాం’అన్నారు. దీనిపై కల్పించుకున్న సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ‘తెలంగాణఫై భట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అభివృధ్ధి చేసుకున్నాక తెలంగాణ తీసుకుందామన్న వ్యక్తి మీరు’ అంటూ విరుచుకుపడ్డారు. అనంతరం మళ్లీ మట్లాడిన భట్టి, కేటీఆర్‌ తన ప్రసంగంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారని, ఎన్నికలప్పుడే ఇళ్లు గుర్తొస్తాయంటూ చురకలంటించారు. అసలు లక్ష ఇళ్లు ఎక్కడున్నాయో చూపించాలన్నారు.

ఈ సమయంలో భట్టి మైక్‌ను స్పీకర్‌ కట్‌ చేయడంతో కాంగ్రెస్‌ సభ్యులు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు పోడియం ముందుకు పోయారు. ఈ సమయంలో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ కల్పించుకుంటూ ‘రేపు ఉదయం మీ ఇంటికి వస్తా. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించారో స్వయంగా చూపిస్తా’ అన్ని గట్టిగా అన్నారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళనతో స్పీకర్‌ తిరిగి భట్టికి అవకాశమిచ్చారు. మళ్లీ భట్టి మాట్లాడుతూ, ‘టైం చెబితే ఇంటికి వస్తా..లక్ష ఇళ్లు ఎక్కడ ఇచ్చారో, కట్టారో చూయించాలి’ అని కౌంటర్‌ ఇచ్చారు. అనంతరం చివరలో మళ్లీ మాట్లాడిన మంత్రి కేటీఆర్‌, భట్టి విమర్శలను దీవెనలుగా తీసుకుంటానని, ఆయన తనకు మంచి మిత్రుడేనని నవ్వుతూ అనడంతో అంతా శాంతించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement