రామచంద్రాపురం (పటాన్‌చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందన్నారు.
పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment