మెదక్ జిల్లా కేంద్రంలో నిలిచిపోయిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్‌ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు.
లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు.
జిల్లా వ్యాప్తంగా..
ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి.
వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్‌కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.
ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలకే పంపిణీ..
జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment