delay in works
-
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పనులు..! సొంతింటి కల నెరవేరేనా..?
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా.. ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్‌కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ.. జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. -
సవాళ్లపై సవారీ!
సాక్షి, హైదరాబాద్: కాలంతో పరుగులు పెడుతూ రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే స్థాయిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఓవైపు వర్షాలు, వరదలు... మరోవైపు కూలుతున్న సొరంగాలు... వీటికితోడు లారీల సమ్మె నిర్మాణ పనులకు సవాళ్లు విసురుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ప్రాం తంలో మూడు లక్షల క్యూసెక్కులకుపైగా వస్తున్న ప్రాణహిత వరద, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించే టన్నెళ్లు కూలుతుండటం, మేడిగడ్డకు అవసరమైన కంకరను 150 కి.మీ. దూరం నుంచి సరఫరా చేయాల్సి రావడం, లారీల సమ్మె నేపథ్యంలో సిమెంట్ లారీలను పోలీసు రక్షణ మధ్య తరలిస్తుండటం ప్రాజెక్టుకు పరీక్షలు పెడుతున్నాయి. అయినప్పటికీ అడ్డంకులు దాటుకొని ఆగస్టు నాటికి పంపుల డ్రై రన్ పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి నీటిని ఎత్తిపోసేలా ఇంజనీర్లు పనులు కొనసాగిస్తున్నారు. పెద్దవాగుదీ పెద్ద కథే... మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి 13.2 కి.మీ. గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలకి నీటిని తరలించాల్సి ఉండగా అక్కడ సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. 224 మీటర్ల వెడల్పుతో 3 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంగల కెనాల్లో 1.80 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేయాల్సి ఉండగా అందులో 90 శాతం పూర్తయింది. ఇక అండర్ టన్నెల్, సూపర్ పాసేజ్, పైప్ బ్రిడ్జి, ఇన్లెట్ అన్ని కలిపి 29 నిర్మాణాలు (స్ట్రక్చర్లు) నిర్మించాల్సి ఉండగా 12 నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కెనాల్లో నీరు చేరడంతో లైనింగ్ పనులు నిలిచిపోయాయి. ఇతర నిర్మాణ ప్రాంతాల్లో దారంతా చిత్తడిగా మారడంతో వాహనాల రాకపోకలకు అవరోధం ఏర్పడుతోంది. ఇదే కెనాల్ పరిధిలోని చివరి అండర్ టన్నెల్ నిర్మాణంలో పెద్దవాగు పెద్ద సమస్యగా మారింది. సుమారు 18 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండే పెద్దవాగు అన్నారం బ్యారేజీ నీటి నిల్వ ప్రాంతంలో గోదావరిలో కలుస్తుంది. ఒకవేళ బ్యారేజీలో 11 టీఎంసీల గోదావరి నీటిని నిల్వ చేశాక పెద్దవాగు సైతం వచ్చి గోదావరిలో కలిస్తే పక్కనే ఉన్న దామరకుంట, గుండురాజుపల్లి, దుబ్బపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలు పూర్తిగా మునగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాగును అండర్ టన్నెల్ ద్వారా దారి మళ్లించి 4.1 కి.మీ. మేర అన్నారం బ్యారేజీ ఆవలకు తరలిస్తున్నారు. పెద్దవాగును దారి మళ్లించే 193.7 మీటర్ల వెడల్పైన అండర్ టన్నెల్ పైనుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. అండర్ టన్నెల్ పనులకు 37 వేల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉండగా ఇప్పటికే 22 వేల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. ఇక్కడ రోజుకు 350 మంది కార్మికులు పనిచేస్తుండగా వచ్చే నెలలో ఈ పని పూర్తి చేస్తామని సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. 9 మీటర్ల సొరంగం పనికి ఎన్నో తిప్పలు... ఎల్లంపల్లి దిగువన పనులను మూడు ప్యాకేజీలు (6, 7, 8)గా విభజించి చేపడుతున్నారు. ప్యాకేజీ–6లో 124.4 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిద్ధమయ్యాయి. కానీ ప్యాకేజీ–7లోని సొరంగ పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక్కడ 11.24 కి.మీ. మేర జంట సొరంగాలను నిర్మించాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే ఐదు చోట్ల కుంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. టన్నెల్ ప్రాంతానికి ఎగువన ఎస్సారెస్పీ కాల్వలు, వాగులు పారుతుండటంతో మట్టి కూలుతోంది. దీనికితోడు పైనుంచి భారీగా నీరు టన్నెల్లోకి కారుతోంది. దీంతో 2,400 హెచ్‌పీ మోటార్లను పెట్టి సొరంగం నుంచి నీటిని తరలించాల్సి వస్తోంది. ఇప్పటివరకు తోడిన నీటి పరిమాణమే సుమారు టీఎంసీ వరకు ఉంటుందని, ఈ నీటితో మేడారం రిజర్వాయర్‌ను నింపొచ్చని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. అయితే నిపుణుల సాయంతో నాలుగు చోట్ల ఈ సమస్యను అధిగమించగా, ఎడమవైపు సొరంగంలో ఇంకా సమస్య అలాగే ఉంది. ఇక్కడ 13 మీటర్ల మేర మట్టి కూలుతుండటంతో విక్రంసింగ్ చౌహాన్ అనే నిపుణుడి సాయం తీసుకున్నారు. దీనికోసం వదులుగా ఉన్న రాతి పొరల్లోకి ప్రత్యేక యంత్రాల ద్వారా సిమెంట్‌ను పంపించి అవి కూలకుండా గట్టిపరుస్తున్నారు. అనంతరం కార్మికుల ద్వారా రోజుకు అర మీటర్ చొప్పున తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 4 మీటర్ల తవ్వకం పూర్తవగా మరో 9 మీటర్లు పూర్తి కావాల్సి ఉంది. అయితే సొరంగంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతుండటం, తగినంత ఆక్సిజన్ లేకపోవడం, సీపేజీ ఎక్కువగా ఉండటంతో ఈ పని పూర్తి చేయడం కత్తిమీద సాములా మారింది. దీంతో టన్నెల్‌కు రెండు వైపుల నుంచి పనిచేయిస్తున్నారు. దీనికితోడు సొరంగంలో లైనింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపునకు ఇదే ముఖ్యం కావడంతో ఆ పని పూర్తికి ఇతర ప్యాకేజీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల సేవలను వినియోగిస్తున్నారు. ఎడమవైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటిని అయినా మళ్లించే అవకాశాలపై దృష్టి పెట్టారు. -
ప్రధాని కోసం ఆలస్యం చేస్తారా..?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిన ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను మే 31లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్‌ప్రెస్ వేను ఏప్రిల్ 20 నాటికి ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఎన్హెచ్ఏఐను ప్రశ్నించింది. ఏప్రిల్ 29న ప్రధానితో రహదారిని ప్రారంభించాలనుకున్నా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని ఎన్హెచ్ఏఐ వివరించగా.. ‘ప్రధాని సమయం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. మీరే ఎందుకు ప్రారంభించకూడదు’ అని ప్రశ్నించింది. మే 31లోపు ప్రారంభించకపోతే, ఇక ప్రారంభించినట్లేనని జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం పేర్కొంది. 135 కిలోమీటర్ల ఈ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వే ద్వారా ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (గ్రేటర్ నోయిడా) పల్వాల్‌లకు సిగ్నల్ రహిత కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రాజధాని వెలుపల రింగ్ రోడ్ నిర్మించాలని సర్వోన్నత న్యాయస్థానం 2006లో ఆదేశించగా ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
కథలు చొప్పొద్దు
కలెక్టర్ జానకి స్వర్ణముఖి పొర్లుకట్ట పనుల పరిశీలన ఇరిగేషన్ ఈఈ, కాంట్రాక్టర్‌పై జిల్లా కలెక్టర్ సీరీయస్ వాకాడు : స్వర్ణముఖి పొర్లుకట్టల పనుల ఆలస్యంగా జరుగుతుండటంపై కలెక్టర్ జానకి సీరియస్ అయ్యారు. కథలు చొప్పొద్దంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాకాడు మండలం గంగన్నపాళెం వద్ద జరుగుతున్న పొర్లుకట్టల పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. గంగన్నపాళెం, పూర్లకండిగ ప్రాంతాల్లో కొంత భూసేకరణ కారణంగా పనులు నిలిసిపోయాయి. ఈ క్రమంలో పనులెందుకు నిలిపేశారని కలెక్టర్ ఇరిగేషన్ ఈఈ నారాయణ నాయక్‌ని అడగ్గా భూ సేరకణ చేయాల్సి ఉందని, కొందర భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను ఇక్కడకి వస్తున్నానని మీకు తెలుసు కదా.. రైతులను పిలిపించి ఉంటే మాట్లాడేవారం కదా.. అలా ఎందుకు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ, కాంట్రాక్టర్ నాయుడు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పొంతన లేని సమాధానం చెప్పడంతో ‘మీరు ఊరకనే కథలు చెప్పకండి’ అంటూ కలెక్టర్ వారిపై సీరియస్ అయ్యారు. వివరాలు తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఆఫీస్‌కే పిలిపించి మాట్లాడుతాను కదా.. ఎందుకిలా చేశారని మందలించారు. అంతకు ముందు వాకాడు వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడారు. తాను రైతులతో మాట్లాడి భూములు ఇప్పిస్తానని పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కాగా గంగన్నపాళెం గిరిజనులు శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఆమె వెంట సబ్‌కలెక్టర్ గిరీషా, తహసీల్దార్ లావణ్య ఇరిగేషన్ డీఈ రాజ్‌గోపాల్ కృష్ణమాచార్యులు, ఏఈ ప్రభుదాస్ ఉన్నారు. ఉండలేకపోతున్నాం.. గూడూరు : వానొస్తే ఉండలేకున్నాం.. అంటూ పుట్టంరాజువారి కండ్రిగకు చెందిన గిరిజనులు కలెక్టర్ జానకికి మొరపెట్టున్నారు. క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దత్తత తీసుకున్న గ్రామంలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఈనెల 4వ తేదీన సాక్షిలో బౌండరీ దాటని పనులు అనే కథనం ప్రచురిమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో గిరిజనులు వానలొస్తే ఇళ్లలోకి నీళ్లువస్తున్నామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆగస్ట్ నెల మొదటివారంలోగా ఏదో ఒక నిధులతో ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జానకి తెలిపారు. అనంతరం ఆమె సర్పంచ్ నాగేశ్వరరావుతో మాట్లాడారు. పలు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని కలెక్టర్ పీఆర్ ఎస్ఈ బుగ్గయ్యపై అసహనం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవలింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉంది.. ఇలానేనా చేసేది? అంటూ కాంట్రాక్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట తహసీల్దార్ సత్యవతి, ఎంపీడీఓ భవాని ఉన్నారు.