న్యూఢిల్లీ: ఢిల్లీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిన ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను మే 31లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్‌ప్రెస్ వేను ఏప్రిల్ 20 నాటికి ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఎన్‌హెచ్‌ఏఐను ప్రశ్నించింది. ఏప్రిల్ 29న ప్రధానితో రహదారిని ప్రారంభించాలనుకున్నా ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని ఎన్‌హెచ్‌ఏఐ వివరించగా.. ‘ప్రధాని సమయం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.
మీరే ఎందుకు ప్రారంభించకూడదు’ అని ప్రశ్నించింది. మే 31లోపు ప్రారంభించకపోతే, ఇక ప్రారంభించినట్లేనని జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం పేర్కొంది. 135 కిలోమీటర్ల ఈ అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ వే ద్వారా ఘజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (గ్రేటర్ నోయిడా) పల్వాల్‌లకు సిగ్నల్ రహిత కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ మీదుగా వెళ్లే ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రాజధాని వెలుపల రింగ్ రోడ్ నిర్మించాలని సర్వోన్నత న్యాయస్థానం 2006లో ఆదేశించగా ఈస్ట్రన్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment