కథలు చొప్పొద్దు
-
కలెక్టర్ జానకి
-
స్వర్ణముఖి పొర్లుకట్ట పనుల పరిశీలన
-
ఇరిగేషన్ ఈఈ, కాంట్రాక్టర్‌పై జిల్లా కలెక్టర్ సీరీయస్
వాకాడు : స్వర్ణముఖి పొర్లుకట్టల పనుల ఆలస్యంగా జరుగుతుండటంపై కలెక్టర్ జానకి సీరియస్ అయ్యారు. కథలు చొప్పొద్దంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాకాడు మండలం గంగన్నపాళెం వద్ద జరుగుతున్న పొర్లుకట్టల పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. గంగన్నపాళెం, పూర్లకండిగ ప్రాంతాల్లో కొంత భూసేకరణ కారణంగా పనులు నిలిసిపోయాయి. ఈ క్రమంలో పనులెందుకు నిలిపేశారని కలెక్టర్ ఇరిగేషన్ ఈఈ నారాయణ నాయక్‌ని అడగ్గా భూ సేరకణ చేయాల్సి ఉందని, కొందర భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను ఇక్కడకి వస్తున్నానని మీకు తెలుసు కదా.. రైతులను పిలిపించి ఉంటే మాట్లాడేవారం కదా.. అలా ఎందుకు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ, కాంట్రాక్టర్ నాయుడు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పొంతన లేని సమాధానం చెప్పడంతో ‘మీరు ఊరకనే కథలు చెప్పకండి’ అంటూ కలెక్టర్ వారిపై సీరియస్ అయ్యారు. వివరాలు తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఆఫీస్‌కే పిలిపించి మాట్లాడుతాను కదా.. ఎందుకిలా చేశారని మందలించారు. అంతకు ముందు వాకాడు వైస్ ఎంపీపీ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడారు. తాను రైతులతో మాట్లాడి భూములు ఇప్పిస్తానని పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కాగా గంగన్నపాళెం గిరిజనులు శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఆమె వెంట సబ్‌కలెక్టర్ గిరీషా, తహసీల్దార్ లావణ్య ఇరిగేషన్ డీఈ రాజ్‌గోపాల్ కృష్ణమాచార్యులు, ఏఈ ప్రభుదాస్ ఉన్నారు.
ఉండలేకపోతున్నాం..
గూడూరు : వానొస్తే ఉండలేకున్నాం.. అంటూ పుట్టంరాజువారి కండ్రిగకు చెందిన గిరిజనులు కలెక్టర్ జానకికి మొరపెట్టున్నారు. క్రికెటర్ సచిన్ టెండుల్కర్ దత్తత తీసుకున్న గ్రామంలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఈనెల 4వ తేదీన సాక్షిలో బౌండరీ దాటని పనులు అనే కథనం ప్రచురిమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో గిరిజనులు వానలొస్తే ఇళ్లలోకి నీళ్లువస్తున్నామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆగస్ట్ నెల మొదటివారంలోగా ఏదో ఒక నిధులతో ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జానకి తెలిపారు. అనంతరం ఆమె సర్పంచ్ నాగేశ్వరరావుతో మాట్లాడారు. పలు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని కలెక్టర్ పీఆర్ ఎస్‌ఈ బుగ్గయ్యపై అసహనం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవలింగ్ ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉంది.. ఇలానేనా చేసేది? అంటూ కాంట్రాక్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట తహసీల్దార్ సత్యవతి, ఎంపీడీఓ భవాని ఉన్నారు.