సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ శరవేగంగా సాగుతోంది. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ బృందాలు రంగలోకి దిగి దరఖాస్తుదారుడి డోర్ టు డోర్ విచారణ నిర్వహిస్తున్నారు. కుటుంబాల పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సుమారు ఏడు లక్షలకు పైగా కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ద్వారా ఓటరు కార్డు, అవసరమైన వివరాలను అప్‌లోడ్ చేశారు. క్షేత్ర స్థాయి విచారణ విచారణ జరగలేదు. తాజాగా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కొంత డబుల్ బెడ్రూం కోటా కేటాయించడం దరఖాస్తులపై కదలిక వచ్చినట్లయింది.
శివారులోనే అధికం..
► జీహెచ్‌ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో ఎక్కువశాతం నగర శివారులోనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు.
► నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. ఇప్పటికే కొల్లూరులో సుమారు 15,660 గృహాలు నిర్మించి లాంఛనంగా ప్రారంభించారు.
మరికొన్ని ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అన్ని అర్హతలు సాధించిన దరఖాస్తులు నియోజకవర్గాల వారీగా లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి కేటాయించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పిస్తామంటూ దళారులు దరఖాస్తుదారులకు గాలం వేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో పాత గృహాలు తొలగించిన (ఇన్ సీటు) 40 ప్రాంతాల్లో 8,898 గృహాలు, 71 ఖాళీ స్థలాల్లో 91,102 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మొత్తం మీద 71 ప్రాంతాల్లో 68,176 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు.
మిగతా 38 ప్రాంతాల్లో వివిధ ప్రగతి దశలో కలవు. రెండు లొకేషన్లలో 2,026 గహాలు వివిధ కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. 42 ప్రాంతాల్లో చేపట్టిన 62,516 రెండు పడకల గదులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మారో 29 లొకేషన్ (ఇన్ సీటు)పేదల పాత గృహాలు తొలగించి 5,660 కొత్త ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు.
► జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 ఇన్ సీటు లొకేషన్ 8,898 రెండు పడకల గదులు, 17 వేకెంట్ ప్రదేశంలో 5,775 గృహాలు మొత్తం 57 లొకేషన్లలో 14,673 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ మధ్యలో 32 ఖాళీ ప్రదేశాల్లో 49,991 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఓఆర్‌ఆర్ బయట ఉన్న 22 ఖాళీ ప్రదేశాల్లో 35,336 ఇళ్లు కడుతున్నారు.
జిల్లాల వారీగా ఇలా..
హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఇన్ సిటు, ఓపెన్ గల 38 లొకేషన్‌లలో 13 నియోజకవర్గాల పరిధిలో 70.73 ఎకరాల స్థలంలో 9453 గృహాలు. రంగారెడ్డి జిల్లాలో 30 లొకేషన్లలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151.36 ఎకరాల స్థలంలో 23,908 ఇళ్లు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 లొకేషన్లలో 3 నియోజకవర్గాల పరిధిలో 38,419, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో 191.79 ఎకరాల్లో 10 లొకేషన్లలో 28,220 గృహ నిర్మాణాలు చేపట్టారు. 111 ప్రాంతాల్లో 668.73 ఎకరాల స్థలంలో లక్ష ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment