హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే గ్రేటర్ పరిధిలోని లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని ప్రారంభించే యోచనలో ఉన్న ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. పైనుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో నగర శివార్లలోని సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో లాంఛనంగా కొందరికి మాత్రం సీఎం చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ చేస్తారని, మిగతా వారికి తర్వాత పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.
కేసీఆర్‌కు సెంటిమెంట్ నంబర్ 6 కావడంతో ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఆరుగురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి ఇద్దరేసి వంతున మొత్తం ఆరుగురు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఆరుగురిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల నుంచి ఒక్కో లబ్ధిదారు ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘కేసీఆర్ నగర్, 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ’గా వ్యవహరించనున్న ఈ కాలనీ15,660 ఇళ్లతో ఓ టౌన్‌షిప్‌ను తలపిస్తోంది. ఇళ్లతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
9 నియోజకవర్గాల వారికి అక్కడే..
గ్రేటర్ పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల వారికి కొల్లూరులోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాల్లేక నగర శివార్లలోని ఖాళీ స్థలాల్లో నిర్మించారు. పేదలు నివసిస్తున్న ఇళ్లనే కూల్చివేసి కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రం వారికే కేటాయించారు. ఎక్కడా ఎలాంటి ఇళ్లు లేని, అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న వారికి కేటాయించేందుకు ఎక్కడ ఖాళీ ప్రదేశాలుంటే అక్కడ నిర్మించారు. అలా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సమీపంలోని పటాన్‌చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాలతో పాటు గోషామహల్, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, బహదూర్‌పురా నియోజకవర్గాల్లోని అర్హులైన పేదలకు కేటాయించనున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లోని వారికి ఇతర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించనున్నారు. లక్ష ఇళ్లకు గాను దాదాపు 68 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
లబ్ధిదారుల ఎంపికకు టీమ్‌లు..
అందిన దరఖాస్తులను ఇప్పటికే స్క్రూటినీ చేసిన అధికారులు వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు జీహెచ్‌ఎంసీలోని 150 వార్డులకుగాను 150 టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ టీమ్‌లకు వీరు సహకరిస్తారు. రెవెన్యూ టీమ్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాయి. అర్హులను ఎంపిక చేశాక, వారిలో నుంచి లాటరీ ద్వారా లబ్ధిదారులను సంబంధిత జిల్లాల కలెక్టర్లు గుర్తిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు సమయం పట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment