సికింద్రాబాద్‌కు చెందిన మణెమ్మ నాలుగేళ్ల క్రితం మీ సేవలో డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. రెండు నెలల క్రితం ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది వచ్చి విచారణ జరిపారు. అన్ని వివరాలు అడగటంతో పాటు ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ ప్రతులను తీసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల డ్రా ఉందని తెలుసుకున్న మణెమ్మ కలెక్టరేట్‌కు వెళ్లింది. అక్కడి ప్రాంగణంలో కనిపించిన వారికి మీ సేవ రసీదు చూపిస్తూ.. నాకు ఇల్లొచ్చిందా సారూ..? జర సూడండి అంటూ వేడుకోవడం కనిపించింది. ఇలా మణెమ్మ ఒక్కతే కాదు.. గత మూడు రోజులుగా కలెక్టరేట్‌కు వస్తున్న ఎంతో మంది పేదలది ఇదే గోస.
హైదరాబాద్: నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో పేదవాళ్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్‌లకు దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆన్‌లైన్ పద్ధతిలో మొదటి విడతగా నియోజకవర్గానికి 500 చొప్పున లబ్ధిదారుల ఎంపిక పక్రియ పూర్తి కావడంతో నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. మీ సేవ రసీదులతో కలెక్టరేట్‌కు చేరుకొని హౌసింగ్ విభాగంలో ఎంపికై న జాబితాలో తమ పేరు ఉందో లేదో అని ఆరా తీసున్నారు.
అక్కడి సిబ్బంది మాత్రం ఇళ్లు మంజూరైతే ఫోన్‌కు సమాచారం(ఎస్‌ఎంఎస్ ) వస్తోందని సమాధానం ఇస్తున్నారు. వాస్తవంగా ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక పూర్తయినా.. ఇంకా ఫోన్‌లకు సమాచార ప్రక్రియ ప్రారంభంకానట్లు తెలుస్తోంది.. ఇది తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 2 నుంచి ఎంపికై న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
మొదటి విడతలో 12 వేల ఇళ్లు
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి మొదటి విడతగా మొత్తం 12 వేల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఏడు లక్షలపైగా దరఖాస్తులు ఉండగా క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం మూడున్నర లక్షల వరకు కుటుంబాలు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. వాటిలో విడతల వారీగా ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి విడత కింద గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజవర్గాలకు కలిపి 7,500, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు అర్బన్ నియోజకవర్గాలకు కలిపి రెండు వేలు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అయిదు అర్బన్ నియోజవర్గాలకు 2,500 మంది లబ్ధిదారులను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేశారు. మిగతా వారికి సైతం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నా.. దరఖాస్తుదారుల్లో మాత్రం ఆందోళన తొలగటంలేదు.
Comments
Please login to add a commentAdd a comment