హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ‘డ్రా పద్ధతి’పై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనదైన శైలిలో ప్రత్యేకతను ప్రదర్శించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్త ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బిట్స్ పిలానీ ఐఐటీ, సివిల్స్ టాపర్ అయిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అధికారుల సహకారంతో ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఆమోదం లభించింది.
ప్రత్యేక డిస్‌ప్లే స్క్రీన్ ద్వారా..
గత నెల 24న హైదరాబాద్ కలెక్టరేట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్ రాస్, మేడ్చల్ కలెక్టర్ అమయ్‌కుమార్ సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రత్యేక ఆన్‌లైన్ డిస్‌ప్లే స్క్రీన్ ద్వారా అర్హత సాధించిన దరఖాస్తుల జాబితా, ఆ తర్వాత ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించి తుది జాబితా ప్రదర్శించారు.
లబ్ధిదారు పేరు, ఆధార్, ఫోన్ నంబర్లు ప్రదర్శించేలా పారదర్శకత పాటించారు. కేవలం 30 నిమిషాల్లోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా లబ్ధిదారుల ఎంపిక విజయవంతం కావడంతో ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సైతం ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశారు.
ఇళ్ల కేటాయింపు సైతం
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన 24 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలోనే ఎంపికై న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. నగర శివారులోని ఎనిమిది ప్రదేశాల్లో నిర్మించిన డబుల్‌బెడ్రూం నివాస సముదాయాల్లో సుమారు 11,700 మంది లబ్ధిదారులకు ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా, సునాయాసంగా జరిగేలా ఆధునిక సాంకేతికతతో కూడిన ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment