చిలుకూరు : పోలేనిగూడెంలో ఇళ్ల ఆక్రమణదారులకు నచ్చజెబుతున్న అధికారులు
సాక్షి, చిలుకూరు (కోదాడ) : ‘మేమంతా నిరుపేదలం.. మాకు సెంటుభూమిలేదు. ఉండడానికి ఇల్లు లేదు. మాకోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలోకి పోతే బెదిరించడం ఏమిటీ? ఎట్టిపరిస్థితుల్లో ఖాళీ చేసేదిలేదు. కేసులకు భయపడం’ అని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ఆక్రమణదారులు స్పష్టం చేశారు. చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామశివారులో నిర్మించి ఉన్న 40 డబుల్‌బెడ్‌రూం ఇళ్లలోకి అదే గ్రామంలోని ఎస్సీకాలనీకి చెందిన 40కుటుంబాలవారు ఆదివారం రాత్రి గృహప్రవేశాలు చేసినవిషయం విదితమే. ఈనేథ్యంలో ఆ ఇళ్లను ఖాళీ చేయించేందుకు తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్‌ఐ నాగభూషణ్‌రావు, పంచాయతీరాజ్ డీఈ సతీష్‌బాబు, ఏఈ లక్ష్మారెడ్డి కలిసి సోమవారం అక్కడికి వెళ్లారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్ నేటి వరకు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించలేదని, వీటిలో కనీస వసతులు లేవని , తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని, ఇలా ఆక్రమణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. మేమంతా అర్హులమే కాబట్టి మాకే కేటాయించాలని, ఖాళీ చేసేదిమాత్రంలేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రైతులు ప్రభుత్వ భూమిని ఆక్రమించినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు నిరుపేదలమైన ముమ్మలను మాత్రం ఇబ్బందులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ నాగభూషన్‌రావు తెలిపారు. ఎంతనచ్చచెప్పినా ఖాళీ చేయడానికి మొండికేయడంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment