
పెళ్లైన ఐదు నెలలకే యువకుడి దారుణ హత్య
కులాంతర ప్రేమ వివాహమే కారణమై
ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు
సోదరుడిపై మృతుడి భార్య ఆరోపణలు
నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
సూర్యాపేట టౌన్: సూర్యాపేటకు చెందిన యువకుడిని గుర్తుతెలియ ని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై పడేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, కులాంతర ప్రేమ వివాహమే హత్యకు కారణం కావొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
స్నేహితుడి ఫోన్‌తో బయటకు వెళ్లి.. శవంగా మారి..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (30) అలియాస్ మాల బంటి, సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. తరచూ నవీన్ ఇంటికి వస్తూండే కృష్ణ.. అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరు కావడంతో వారు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కృష్ణ, భార్గవి గత ఏడాది ఆగస్టులో నకిరేకల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణ సూర్యాపేటలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భార్గవితో కలిసి ఉంటున్నాడు.

సూర్యాపేట జిల్లా ఆస్పత్రి వద్ద రోదిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యులు
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బైరు మహేశ్ అనే మిత్రుడి నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన కృష్ణ అదే రాత్రి హత్యకు గురయ్యాడు. భార్గవి మహేశ్‌కు రాత్రి 11 గంటలకు ఫోన్ చేయగా లిప్ట్ చేయలేదు. సోమవారం ఉదయం కెనాల్ కట్టపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మెడకు ఉరి వేసి చంపినట్లుగా గుర్తులు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణకు ఉరేసి హత్య చేసిన దుండగులు, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్, హత్య కేసు నమోదు
కులాంతర వివాహం(inter caste marriage) చేసుకున్నందుకు కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్లు భార్గవి ఆరోపిస్తోంది. దీంతో పోలీసులు కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ తండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భార్గవి తండ్రి సైదులు, సోదరులు వంశీ, నవీన్, కృష్ణ స్నేహితుడు బైరు మహేశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నలుగురు పరారీలో ఉండగా రెండు బృందాలు గాలింపు చేపట్టాయి. కృష్ణపై గతంలో రెండు హత్యాయత్నం కేసులు ఉండగా, బైరు మహేశ్‌పై రౌడీషీటర్ కేసు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాత కక్షలా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ రవి చెప్పారు.
న్యాయం చేయాలని ధర్నా
కృష్ణ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో మాలమహానాడు, దళిత సంఘాల నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment