పొరుగింటి వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకున్న యువతి
వారి ఇంటికి వెళ్లకుండా రోడ్డుపై గోడకట్టిన తల్లిదండ్రులు
తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు
కరీంనగర్ జిల్లా ఎరడపల్లి గ్రామంలో సంఘటన
శంకరపట్నం (మానకొండూర్): పొరుగింటి వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు తమ కూతురుపై కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై ఇటుకలతో గోడకట్టారు. దీనిపై గ్రామ పెద్దలతో చెప్పించినా వారు వినకపోవడంతో కూతురు తన తల్లిదండ్రులపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే వాళ్లుసైతం తన సమస్యను పట్టించుకోవడం లేదని శుక్రవారం మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింటి వ్యక్తి అయిన కనకం రత్నాకర్‌ను 2023 ఫిబ్రవరి 16న ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి మమత కుటుంబానికి ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ కేశవపట్నంలో అద్దెకుంటున్నారు. అక్కడే జిరాక్స్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా, రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివాసం ఉంటున్నారు.
మమత తల్లి ఇంటి ఎదుట నుంచే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబసభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఇప్పటి నుంచి దొడ్డిదారి గుండా నడుస్తున్నామని, తన అత్తారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి, ఇబ్బందులు పెడుతున్న తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని మమత నాలుగు రోజల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మమత కోరింది.
Comments
Please login to add a commentAdd a comment