సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేసే గృహలక్ష్మి పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం వ్యవహారం అగమ్యగోచరంగా మారింది. ఇళ్లను పూర్తి చేయాలంటే రూ. 7,500 కోట్ల నిధులు అవసరమవగా వాటిని సమకూర్చుకోవడం సర్కారుకు కష్టంగా మారింది. అలా అని వదిలేద్దామంటే 85 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
రుణం అంటే జంకుతున్న ఆర్థిక శాఖ..
ఇప్పటికే రూ. 9,800 కోట్ల రుణాన్ని హడ్కో నుంచి తీసుకొని ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. అయితే గత 9 ఏళ్లలో 1.40 లక్షల ఇళ్లనే పూర్తి చేయగలిగింది. అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తొలి విడత నిధులను సైతం ఖర్చు చేసింది. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్)
అయితే లబ్దిదారుల ఎంపిక ప్రాథమిక కసరత్తు పూర్తికాకపోవడాన్ని తప్పుబడుతూ కేంద్రం పీఎంఏవై మలివిడత నిధులిచ్చేందుకు నిరాకరించింది. దీంతో దాదాపు రూ. 1,200 కోట్ల నిధులు చేతికందకుండా పోయాయి. మరోవైపు ఇప్పటికే భారీగా రుణం ఇచ్చిన హడ్కో సైతం మరోసారి రుణం ఇచ్చేందుకు తటపటాయిస్తోంది. ఇంకోవైపు ఇప్పటివరకు కట్టిన ఇళ్లకు సంబంధించి రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
వాటి సంగతేంటి?
దాదాపు 90 శాతం పనులు పూర్తయి తుది మెరుగులకు సిద్ధంగా 50 వేల ఇళ్లున్నాయి. బేస్‌మెంట్, ఇటుక పని పూర్తయినవి మరో 35 వేల ఇళ్లున్నాయి. వాటిని పూర్తి చేయాలంటే రూ. 3,500 కోట్లు కావాలి. ఆ మేరకు నిధులిస్తేనే ఈ ఇళ్లను వేగంగా పూర్తి చేస్తామని గృహనిర్మాణ విభాగం పలుమార్లు ఆర్థిక శాఖను కోరింది. పనిలో వేగం తగ్గితే అసంపూర్తి నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది.
టెండర్లు పిలిచి ఇంకా పనులు ప్రారంభించని ఇళ్లు 62 వేల వరకు ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలంటే మరో రూ. 4 వేల కోట్లు కావాలి. ప్రస్తుతానికి వాటిని పెండింగ్‌లో పెట్టి తుదిదశకు చేరుకున్న ఇళ్లను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం తాజాగా 90 శాతం పనులు పూర్తయిన వాటి వివరాలను ఆర్థిక శాఖకు అందజేశారు. త్వరలో మంత్రుల కమిటీ సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?)
ఇళ్ల కేటాయింపు అంటేనే టెన్షన్..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 43 వేల ఇళ్లనే లబ్దిదారులకు కేటాయించారు. దాదాపు 88 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. గతంలో స్వీకరించిన దరఖాస్తులు కూడా అధికారుల వద్ద ఉన్నాయి. ఇళ్ల సంఖ్యకు కొన్ని రెట్లు ఎక్కువగా దరఖాస్తులు ఉండటంతో ఎంపిక కాని వారు ఆందోళనలు చేసే ప్రమాదం ఉంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటుందంటూ అధికారులు ఇళ్ల కేటాయింపును పెండింగ్‌లో పెట్టేశారు.
కొల్లూరు డబుల్ ఇళ్ల దుమ్ము దులిపి...
సీఎం కేసీఆర్ తాజాగా కొల్లూరులో 15,600 డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఇళ్లు దాదాపు రెండేళ్ల క్రితమే సిద్ధమైనా వినియోగంలో లేకపోవటంతో మొత్తం దుమ్ముకొట్టుకుపోయాయి. వాటి ప్రారంభానికి సీఎం వస్తుండటంతో అధికారులు 500 మంది కూలీలను పెట్టి దుమ్ము దులిపించారు. సీఎం పరిశీలించే ఇళ్లకు కొత్తగా రంగులు వేయించారు. పగిలిన కిటికీ అద్దాలను మార్పించారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు 80 వేలకుపైగా డబుల్ ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. (ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment