పద్మనగర్‌లో గోడు వెళ్లబోసుకుంటున్న మల్లిక
సిరిసిల్ల టౌన్: ‘ఓట్లప్పుడు మాలాంటి గరీబోళ్లకు డబుల్ బెడ్రూం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేసిండు. అదే ఆశతో ఉంటున్నాం. కానీ.. సిరిసిల్లలో అధికారులు లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారు. డబుల్‌బెడ్రూం ఇల్లు కోసం పుస్తెలు అమ్మి లంచం ఇవ్వాలని వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన నందగిరి మల్లిక మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. మల్లిక వివరాల మేరకు.. అధికారులు స్థానిక కమ్యూనిటీ హాలులో డబుల్‌బెడ్రూం ఇళ్ల అర్హుల లిస్టును మంగళవారం ప్రకటించారు. లిస్టులో మల్లిక కుటుంబం పేరు లేదు. దీంతో దివ్యాంగుడైన తన భర్త పేరు లిస్టులో రాలేదని, తాము ఏ రకంగా అర్హులం కాదని మల్లిక వేదికపై ఉన్న కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది.
‘మా ఆయనకు ఒక చేయి పూర్తిగా పనిచేయదు. నేను ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచిపని చేసి ఇద్దరు పిల్లలతో పాటు అత్తను పోషిస్తున్న. పదమూడేళ్లుగా పద్మనగర్‌లోనే కిరాయికి ఉంటున్నం. డబుల్‌బెడ్రూం కోసం గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న. ఆర్పీల ముందే ఇద్దరుసార్లు వచ్చి పార్కులో కూర్చుని రూ.లక్ష లంచం అడిగిండ్రు. అవే ఉంటే డబుల్‌బెడ్రూం ఇండ్లకోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటా? ఇప్పుడు లిస్టులో పేరు తీసేసిండ్రు. మాకు ఎక్కడా జాగలు, సొంతిల్లు లేవు. పుట్టింటి, అత్తింటి ఆస్తులు కూడా లేవు. ఏ విచారణకైనా సిద్ధం. మేము ఏవి«ధంగా అర్హులము కాదో చెప్పండి. నాకు న్యాయం కావాలి’ అంటూ వేదికపై తన బాధను వెలిబుచ్చింది.
మల్లిక ఒక్కతే కాదు.. పద్మనగర్ వార్డుసభలో జాబితాలో పేర్లు రానివారి రోదనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు లిస్టులో లేకపోవడమేంటంటూ వారు అధికారులు, ప్రజా ప్రతినిధులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్లను లంచాలు అడిగి ఏం బాగుపడుతారంటూ వాపోయారు. దీంతో చివరకు అర్హులైన పలువురి పేర్లను డ్రాలో వేయించడానికి మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment