సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతున్న తీరు, పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీకి గానూ కొన్ని మాత్రమే పూర్తికావడాన్ని ప్రధాన సమస్యల్లో ఒకటిగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.
పార్టీ పరంగా చేపట్టబోయే ఆందోళనల్లో ఆయా వర్గాలకు చెందిన బాధిత ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగా... అమెరికా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తిరిగి రాగానే ఈ నెల 20న నగరానికి సమీపంగా ఉన్న బాటసింగారంలో డబుల్ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తారు.
24న జిల్లా కేంద్రాల్లో నిరసన
రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా డబుల్ ఇళ్లనిర్మాణంపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
ధరణితో సహా రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోకపోవడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.
21న కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ...
ప్రస్తుతం ఆషాఢమాసం కావడం, విదేశీ పర్యటనల్లో ఉండటంతో ఈ నెల 21న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ చేపట్టబోయే కార్యాచరణ, వ్యూహాలపై ఈ నెల 22న జరగనున్న కోర్ కమిటీ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.
ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ వర్గాల ప్రజలు, మేధావులను (30 వేల మందిని) కలుసుకుని పార్టీకి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో భాగస్వాములై తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ శాసనసభా స్థానాల్లో చేపట్టే ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఒక్కో అసెంబ్లీ సీటు పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనరల్ సీట్ల పరిధిలో సభలు జరుపుతారు. వచ్చేనెల 15 లోగా ఈ సభలను పూర్తిచేయాలని
నిర్ణయించారు.
119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల బస
ఆగస్టు 16 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు (ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున) వారం రోజులపాటు బస చేస్తారు. అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన, పార్టీ బలం, బలహీనతలు తదితర అంశాలను పరిశీలించి జాతీయ నాయకత్వానికి వారు నివేదికలు ఇవ్వనున్నట్టు పార్టీవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment