సంగారెడ్డి: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని త్వరగా అందజేయాలని ఓ వ్యక్తి రోడ్డుపై హల్‌చల్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. మండల కేంద్రం పుల్‌కల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుల్‌కల్ గ్రామానికి చెందిన బట్టు చిరంజీవి రాజుకు అతని భార్య మమత పేరుపై పుల్‌కల్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం మంజూరైంది.
అయితే వాటిలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. దీంతో ఇల్లు మంజూరైనా కాలయాపన జరుగుతుండటంతో అసహనానికి గురైన చిరంజీవి రాజు శుక్రవారం ఉదయం పెట్రోలు సీసాతో పుల్‌కల్ ప్రధాన రోడ్డుపై హల్‌చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతు ఇబ్బంది కలిగించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తుండగా కింద పడిపోయాడు.
గమనించిన డ్రైవర్ ఆపే ప్రయత్నం చేస్తుండగానే వెనుక చక్రాలు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రాజయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను గుర్తించామని, ఇళ్లను కూడా కేటాయించామని తెలిపారు. చిన్న చిన్న పనులు మిగిలిపోవడంతో కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment