సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్‌తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు.
దేశంలోనే తొలి దేవాలయం!
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు.
కంప్యూటర్‌లో రూపొందించి..
కంప్యూటర్‌లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్‌లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది.
ఇటీవల ప్రారంభం..
సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు.
ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత!
దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్‌తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది.
కూలీల పని తప్పింది
3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ
ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment