చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలకూ కేటాయింపు
మూసీ రివర్‌ఫ్రంట్‌పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
జల వనరుల పరిరక్షణ చర్యల్లో పేదలు రోడ్డున పడొద్దు
వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలి
ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురవకుండా గట్టి పర్యవేక్షణ
సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోరైల్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంతోపాటు హైదరాబాద్‌లోని చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జల వనరుల పరిరక్షణలో పేదలు రోడ్డున పడవద్దని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు వారు సహకరించేలా ఒప్పించడంతోపాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ మేరకు అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు తేల్చండి
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని.. ఆక్రమణల వివరాలన్నీ సేకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణపై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు.
నేటి నుంచే ‘మూసీ’ పునరావాస ప్రక్రియ!
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్లలో నివాసమున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో.. పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నారు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు.
బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్‌లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్‌జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చుతోపాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment