పాపన్నపేట (మెదక్ జిల్లా): కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా నీటి తీరువా రద్దు చేశారా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా..ఎకరానికి రూ.10 వేలు ఏ రాష్ట్రమైనా ఇస్తోందా? అని నిలదీశారు. పేదింటి అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, రైతు బీమాకు రూ.5 లక్షలు ఎక్కడైనా ఇస్తున్నారా అని అడిగారు. మన పథకాలే కేంద్రం కాపీ కొడుతోందని పునరుద్ఘాటించారు. మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం, ఛత్రియాల్‌లో 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల సొంత జాగాలో ఇళ్లు కట్టుకోలేకపోయామని తెలిపారు. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగిందని తెలిపారు. అయినా కూడా కల్యాణలక్ష్మి, రైతుబంధు, పింఛన్‌లు ఆపలేదని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. రైతులంతా ఆలోచన చేయాలని సూచించారు. రుణమాఫీ, సొంత జాగాలో ఇల్లు మాత్రమే ఆగాయని చెప్పారు. ఉగాది తర్వాత ఈ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తాం అని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి తీరువాను రద్దు చేసి ఎకరానికి రూ.పది వేలు ఇస్తోందని తెలిపారు.
2014 తర్వాత నీరు వదలమని హైదరాబాద్‌కు ఒక్క రైతన్నా వెళ్తున్నాడా అని ప్రశ్నించారు. అప్పుడు ఊరికి 2 జీప్‌లలో రైతులంతా హైదరాబాద్ వెళ్లి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచుతున్నామని.. నీటికి ఇబ్బంది లేదని తెలిపారు. కాళేశ్వరం నీటిని పాపన్నపేటకు తెస్తున్నట్లు చెప్పారు. సింగూరుకు కాళేశ్వరం నీరు నింపుతాం.. రెండు పంటలు పండించుకుంటామని పేర్కొన్నారు. మూడో పంట వేయాలన్న ఆలోచన వచ్చే రీతిలో పరిస్థితులు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment