కేంద్రం నుంచి వచ్చే సొమ్ము రూ. 400 కోట్లే
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ‘ఇందిరమ్మ’ పథకానికే సరి
డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధుల సర్దుబాటు ఎలాగనే సందేహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే...దాదాపు రూ. 4 వేల కోట్లు కావాలి. అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులు రూ.400 కోట్లు మాత్రమే. ఇటీవల రాష్టŠట్ర ప్రభుత్వం డబుల్ ఇళ్లను పూర్తిచేసి లబి్ధదారులకు వీలైనంత త్వరలో అందజేస్తామని శాసనసభలో ప్రకటించింది. కానీ బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు ఇందిరమ్మ పథకానికే సరిపోయే పరిస్థితి. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
లబ్ధిదారుల జాబితా అందజేసినా..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూం పథకంలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. గత సర్కారు 2.90 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. 2.28 లక్షల ఇళ్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. అందులో 1.53 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇంకా ఒప్పందం జరగని ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది.
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. అందులో తొలి విడతగా అప్పట్లోనే రూ.1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం..లబ్దిదారుల జాబితాను అందించాకే రెండో విడత నిధులు విడుదలవుతాయి. కానీ అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం లబి్ధదారుల ఎంపిక చేపట్టలేదు. దీంతో నిధులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా సరిపోక ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది.
ఆ ఇళ్లను పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 69వేల మంది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి అందించగా.. మలి విడతగా రూ.500 కోట్లు ఇటీవల విడుదల అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రూ.1,600 కోట్లు అందగా, మరో రూ.400 కోట్లు మాత్రమే రావాల్సి ఉంది.
కానీ డబుల్ ఇళ్లన్నీ పూర్తి చేయాలంటే రూ.4 వేల కోట్లు కావాలని లెక్కలు వేశారు. ఈ నిధుల సర్దుబాటు ఎలాగన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నే హడ్కోవంటి సంస్థల నుంచి రుణం పొంది ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. దీనికితోడు బడ్జెట్‌లో రూ.ఏడున్నరవేల కోట్లు ఇళ్లకు కేటాయించారు. ఇవన్నీ కూడా ఇందిరమ్మ పథకానికే సరిపోవని.. డబుల్ ఇళ్ల పూర్తి ఎలాగన్నది తేలడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment