సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనకు సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబైంది. రూ.870 కోట్ల వ్యయం తో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గురువారం సీఎం చేతుల మీదుగా జరగనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించనున్నారు. నర్సాపూర్ శివారులో నిర్మించిన 2,461 డబుల్ బెడ్రూం ఇళ్లలో మొదటి దశలో 144 లబ్దిదారులు గురువారం సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు.
9వ బ్లాక్‌లోని 3వ నంబర్ నివాసగృహంలో లబ్దిదారుడి కుటుంబంతో సీఎం దగ్గరుండి గృహప్రవేశం చేయిస్తారు. అంతకుముందు భారీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. పొన్నాల శివార్లలో నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిర్మిస్తున్న జిల్లా కార్యాలయాల్లో ప్రారంభం జరుగుతున్న మొదటి పార్టీ ఆఫీసు ఇదే. మరోవైపు మెడికల్ కళాశాల, రంగనాయకసాగర్ అతిథిగృహం, సిద్దిపేట పట్టణంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, రైతు వేదికలను ప్రారంభిస్తారు. వెయ్యి పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సిద్దిపేటలో బహిరంగ సభ
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతగడ్డ సిద్దిపేటకు రానున్న క్రమంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం సభకు 10 వేల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. సీఎం పర్యటనలో హరీశ్‌రావుతో పాటు ఇతర మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు పాల్గొననున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్..
– ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి నుంచి సీఎం రోడ్డు మార్గాన సిద్దిపేటకు బయలుదేరుతారు.
– 11 గంటలకు కొండపాక మండలం దుద్దెడకు రాక.
– 11.10కి ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన.
– 11.20కి పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు
– 11.40కి మిట్టపల్లిలో రైతు వేదికను ప్రారంభిస్తారు
– 12 గంటలకు ఎన్సాన్‌పల్లి శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. అక్కడే వెయ్యి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన.
– 12.30కి కోమటిచెరువును సందర్శించి నెక్లెస్‌రోడ్డును తిలకించనున్నారు
– 12.45 గంటలకు నర్సాపూర్ శివారులోని డబుల్ బెడ్రూం మోడల్ కాలనీలో (కేసీఆర్ నగర్) గృహప్రవేశాలు చేయించనున్నారు
– 1.20కి సిద్దిపేట పట్టణంలోని చింతల్ చెరువు వద్ద నిర్మించిన మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభం.
– 1.40 గంటలకు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ మధ్యలో నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మంత్రులతో కలిసి మధ్యాహ్నభోజనం చేస్తారు.
– 3 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment