సాక్షి, హైదరాబాద్: జియాగూడలో మంత్రి కేటీఆర్ సోమవారం పేదలకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ పట్టాలను అందజేశారు. కట్టల మండిలో 120 డబుల్‌బెడ్ రూం ఇళ్లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘జియాగూడలో ఈరోజే దసరా జరుగుతున్నట్టుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు. ఇప్పుడు దేశ చరిత్రలో నేనే ఇల్లు కట్టిస్తా, పేదింటి బిడ్డలకు పెళ్లి చేస్తా అని కేసీఆర్ చెప్తున్నారు. పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. హైదరాబాద్‌లో మొత్తం లక్ష ఇళ్లు కట్టి సిద్ధంగా ఉంచాం. దశలవారీగా పేదలకు అందిస్తాం.
గత ప్రభుత్వాల్లో పేదల ఇళ్ల పేరుతో అవినీతి జరిగింది. ప్రభుత్వానికి 9 లక్షలు ఖర్చయినా ఇవాళ మార్కెట్‌లో వీటి విలువ 50 లక్షల వరకు ఉంటుంది. తెలంగాణ మొత్తంలో 2 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మిస్తున్నాం. సొంతంగా సొసైటీ ఏర్పాటు చేసుకోండి. 56 షాపులు నిర్మించాం. వాటి రెంట్‌తో లిఫ్ట్‌లు, పారిశుధ్యం మెయింటెనెన్స్ చేసుకోండి. పైరవీలకు తావు లేకుండా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. మూసీ సుందరీకరణ త్వరలోనే చేపడతాం’ అని ఆయన అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌ని స్లమ్ లేని నగరంగా చేయాలనేది కేసీఆర్ స్వప్నం. తెలంగాణ రాక ముందు కరెంట్ ఉంటే వార్త. ఇపుడు కరెంట్ పోతే వార్త. చిన్నప్పుడు ఆబిడ్స్‌లో చదువుకున్నాను. అప్పట్లో గొడవలు జరిగి, కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడు నగరంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. 60 ఏళ్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment