బాధితులతో మాట్లాడుతున్న పొంగులేటి
భద్రాద్రి: ధన్‌బాద్ పంచాయతీ రెండో వార్డు సభ్యుడు, మాయాబజార్‌కు చెందిన పిచ్చేటి శివకుమార్, దనసరి బన్ను తమకు ఇళ్ల స్థలాలు రాలేదని సోమవారం 5 ఇంక్‌లైన్‌లో సెల్ టవరెక్కి నిరసన తెలిపారు. మాయాబజార్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయే వారికి ఈ నెల 3న సింగరేణి ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు 347 మందికి 100 గజాల చొప్పున కొత్తగూడెం ఎమ్మెల్యే చేతుల మీదుగా స్థలాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆ జాబితాలో పేర్లు లేకపోవడంతో శివకుమార్, బన్ను మనస్తాపం చెంది సెల్‌టవర్ ఎక్కా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తల్లి దండ్రుల కాలం నుంచి సుమారు 60 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. వీకే–7ఓసీ విస్తరణలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, వేరే చోట స్థలాలు ఇస్తామని సింగరేణి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు చెప్పారని తెలిపారు.
సర్వే చేసిన జాబితాలో ఉన్న పేర్లు, పంపిణీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పేర్లు చేర్చారని, తమకు మాత్రం అన్యాయం చేశారని వాపోయారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝెర్రా కామేష్ అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. దీంతో బాధితులు టవర్ దిగారు.
అనంతరం పొంగులేటి ఫోన్ ద్వారా సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. కామేష్ మాట్లాడుతూ వీకే–7ఓసీ విస్తరణ బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జాబితాలో కొందరు బాధితుల పేర్లు లేకుండా చేశారని, యూనియన్ నాయకులు, సొంత ఇళ్లు ఉన్నవారి పేర్లు అక్రమంగా చేర్చారని పేర్కొన్నారు. నేడు జరిగే పట్టాల పంపిణీని నిలిపివేసి, మళ్లీ సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
సెల్ టవరెక్కిన మరో నిర్వాసితుడు
ఇంటి స్థలం మంజూరు కాలేదని సోమవారం రాత్రి ఎస్‌ఆర్‌టీ కాలనీకి చెందిన యువకుడు రవితేజ కూడా రుద్రంపూర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఓసీ విస్తరణ నిర్వాసితులకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల జాబితాలో పేరు లేకపోవడంతో ఆర్కే స్వామి చిన్న కుమారుడు రవితేజ సెల్ టవరెక్కి సుమారు మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశాడు. త్రీ టౌన్ సీఐ మురళి, డీటీ తిరుమల తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పారు. డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యువకుడు సెల్‌టవర్ దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment