గూడు రాక.. గోస తీరక
లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి 15నెలలు
నేటికీ నెరవేరని పేదల సొంతింటి కల
హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులు
సాక్షి, పెద్దపల్లి: పేద, మధ్యతరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల తీరడం లేదు. సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు నెలలు గడుస్తున్నా హక్కుపత్రాలు అందడంలేదు. దీంతో వారు ప్రత్యక్ష ఆందో ళనకు దిగుతున్నారు. కళ్లెదుటే ఇళ్లు కనిపిస్తున్నా.. వాటిని కేటాయించకుండా తాత్సారం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పన పూర్తికాలేదని, అందుకే కేటాయించడం లేదని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన అధికారులు.. ఇంకా కాలయాపన చేయడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే తమకు ఇళ్ల కేటాయించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటిని పంపిణీ చేస్తారా? లేక రద్దు చేస్తారా? అని పేద కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
డబుల్ ఇళ్లకు 2,17,925 దరఖాస్తులు..
● ఇళ్లులేని, స్థలం ఉన్నా నిర్మించుకునే స్థోమతలేనివారి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది.
● జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి తొలివిడతలో మూడు వేల ఇళ్ల చొప్పున కేటాయిస్తూ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
● ఈక్రమంలో జిల్లాకు 8,475 ఇళ్లు కేటాయించగా, 33,816 మంది దరఖాస్తు చేసుకున్నారు.
● వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికార యంత్రాంగం.. అందులో 25,040 మందిని అర్హులుగా గుర్తించింది.
● జిల్లాలోని ఒక్క మంథని నియోజకవర్గంలోని 454 మంది లబ్ధిదారులకే ఇళ్ల మంజూరుపత్రాలు అందజేసింది.
● పెద్దపల్లి, రామగుండంలో ఐదుగురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు.
● ఈక్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
● కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి, దానిస్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది.
● దీనికింద కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.5లక్షల సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
● ఇందులో భాగంగా ఆరు రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ‘అభయహస్తం’ పేరిట దరఖాస్తులు స్వీకరించింది.
● జిల్లావ్యాప్తంగా 2,17,925 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో మెజార్టీ కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
● అయితే, ఇళ్ల హక్కు పత్రాలు ఎప్పుడు కేటాయిస్తారో, తాము ఆ ఇళ్లలోకి ఎప్పుడు వెళ్తామోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
ఇవి పెద్దపల్లి సమీప కూనారం రోడ్డు, చందపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 484 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. 2023 మార్చి 15న అధికా రులు డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెలలు గడుస్తున్నా నివాసయోగ్యానికి అవసరమైన ప్రొసీడింగ్ కాపీలు ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు.
హక్కుపత్రాలు ఇవ్వాలని లబ్ధిదారులు ఇటీవల కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తామేమీ చేయలేమని అప్పటి కలెక్టర్ వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించివేశారు. కోడ్ ఎత్తివేశాక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఇటీవల డబుల్‌బెడ్రూమ్ ఇళ్లు పరిశీలించారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న వీరు డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియా, మాల్కాపూర్ శివారులో నిర్మించిన 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిజర్వేషన్ ప్రాతిపదికన గత ప్రభుత్వం 2023 మార్చి 16న డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఎవరికీ హక్కుపత్రాలు ఇవ్వలేదు. దీంతో సోమవారం వారు ప్రజావాణికి హాజరై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment