15,660 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు 117 బ్లాకులు.. | CM KCR Public Meeting At Patancheruvu | Sakshi
Sakshi News home page

15,660 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు 117 బ్లాకులు..

Published Thu, Jun 22 2023 3:46 AM | Last Updated on Thu, Jun 22 2023 10:54 AM

CM KCR Public Meeting At Patancheruvu - Sakshi

కొల్లూరు డిగ్నిటీ హౌసింగ్‌ టౌన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం భారీ స్థాయిలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ‘కేసీఆర్‌ నగర్‌ 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ టౌన్‌షిప్‌’ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివార్లలోని సంగారెడ్డి జిల్లా ఆర్‌సీపురం మండలం కొల్లూరులో రెండో దశ కింద ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లాంఛనంగా ఇళ్ల పట్టాలను అందించనున్నారు.  

కార్పొరేట్‌ స్థాయి హంగులతో.. 
కొల్లూరులో సుమారు 144.50 ఎకరాల్లో రూ.1,474.75 కోట్ల వ్యయంతో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోని విధంగా, సకల హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇక్కడ మొత్తంగా 117 బ్లాకుల్లో 15,660 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఉన్నాయి. ఈ టౌన్‌షిప్‌లో మొత్తంగా 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లను నిర్మించారు. మొత్తంగా 2.1 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ (అండర్‌ గ్రౌండ్‌ కలిపి) ట్యాంకులను ఏర్పాటు చేశారు. అండర్‌ గ్రౌండ్‌ ద్వారానే విద్యుత్‌ సరఫరా కేబుళ్లు వేశారు.

లిఫ్టులకు, వాటర్‌ సప్లై, ఎస్‌టీపీలకు విద్యుత్‌ సరఫరా కోసం 30 కేవీఏ నుంచి 400 కేవీఏ వరకు 133 జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్‌ చేసే ఎస్టీపీలను, శుద్ధి చేసిన నీటిని సుందరీకరణ పనులకు వాడేలా పైప్‌లైన్‌ నిర్మించారు. 10.55 కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్, 10.05 కిలోమీటర్ల తాగునీటి పైప్‌లైన్, 10.60 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్, 137 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి దీపాల కోసం 528 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న 3 షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో 118 షాపులు, ప్రతి బ్లాక్‌కు రెండు చొప్పున 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. 

సామాజిక వసతులూ ఎన్నో.. 
► టౌన్‌షిప్‌ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్‌ ట్రాక్, ఆట స్థలం, ఓపెన్‌ జిమ్, ఇండోర్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్, ఓపెన్‌ స్పోర్ట్స్‌ ఏరియా, మల్టీపర్పస్‌ గ్రౌండ్, ఆంఫి థియేటర్, ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్లనూ ఏర్పాటుచేశారు. 

► కాలనీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్, విద్యార్ధుల కోసం ప్లేస్కూల్, అంగన్‌వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్‌ టెర్మినల్, బస్‌స్టాప్, పోలీస్‌స్టేషన్, ఫైర్‌స్టేషన్, మిల్క్‌ బూత్‌లు, పెట్రోల్‌ బంకు, పోస్టాఫీసు, ఏటీఎం, బ్యాంకు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యార్డు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 
 
శంకర్‌పల్లిలో ప్రైవేటు రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించనున్న కేసీఆర్‌ 
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మేధా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు. వంద ఎకరాల్లో, సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ 2017–18లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

ఏటా 500 రైల్వేకోచ్‌లు, 50లోకోమోటివ్‌ల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రైల్వే పరికరాల ఉత్పత్తిలోని ప్రైవేటు సంస్థల్లో పెద్దదైన మేధా సంస్థ.. భారతీయ రైల్వేకు కూడా వివిధ ఉత్పత్తులను మేధా సంస్థ సరఫరా చేస్తోంది. ఫాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికిపైగా ఉపాధి పొందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. 

పటాన్‌చెరులో బహిరంగ సభ 
కొల్లూరులో డబుల్‌ బెడ్రూం టౌన్‌షిప్‌ను ప్రారంభించిన అనంతరం పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. అనంతరం పటాన్‌చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీశ్‌రావు బుధవారం పరిశీలించారు. 30 వేల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement