kolluru
-
15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం భారీ స్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ‘కేసీఆర్ నగర్ 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్’ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశ కింద ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఇళ్ల పట్టాలను అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి హంగులతో.. కొల్లూరులో సుమారు 144.50 ఎకరాల్లో రూ.1,474.75 కోట్ల వ్యయంతో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోని విధంగా, సకల హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇక్కడ మొత్తంగా 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఈ టౌన్షిప్లో మొత్తంగా 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లను నిర్మించారు. మొత్తంగా 2.1 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ (అండర్ గ్రౌండ్ కలిపి) ట్యాంకులను ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారానే విద్యుత్ సరఫరా కేబుళ్లు వేశారు. లిఫ్టులకు, వాటర్ సప్లై, ఎస్టీపీలకు విద్యుత్ సరఫరా కోసం 30 కేవీఏ నుంచి 400 కేవీఏ వరకు 133 జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసే ఎస్టీపీలను, శుద్ధి చేసిన నీటిని సుందరీకరణ పనులకు వాడేలా పైప్‌లైన్ నిర్మించారు. 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, 10.05 కిలోమీటర్ల తాగునీటి పైప్‌లైన్, 10.60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్‌లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల కోసం 528 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న 3 షాపింగ్ కాంప్లెక్స్‌లలో 118 షాపులు, ప్రతి బ్లాక్‌కు రెండు చొప్పున 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. సామాజిక వసతులూ ఎన్నో.. ► టౌన్షిప్ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, ఆట స్థలం, ఓపెన్ జిమ్, ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, మల్టీపర్పస్ గ్రౌండ్, ఆంఫి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్లనూ ఏర్పాటుచేశారు. ► కాలనీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్, విద్యార్ధుల కోసం ప్లేస్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్‌స్టాప్, పోలీస్‌స్టేషన్, ఫైర్‌స్టేషన్, మిల్క్ బూత్‌లు, పెట్రోల్ బంకు, పోస్టాఫీసు, ఏటీఎం, బ్యాంకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. శంకర్‌పల్లిలో ప్రైవేటు రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించనున్న కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. వంద ఎకరాల్లో, సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ 2017–18లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఏటా 500 రైల్వేకోచ్‌లు, 50లోకోమోటివ్ల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రైల్వే పరికరాల ఉత్పత్తిలోని ప్రైవేటు సంస్థల్లో పెద్దదైన మేధా సంస్థ.. భారతీయ రైల్వేకు కూడా వివిధ ఉత్పత్తులను మేధా సంస్థ సరఫరా చేస్తోంది. ఫాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికిపైగా ఉపాధి పొందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. పటాన్చెరులో బహిరంగ సభ కొల్లూరులో డబుల్ బెడ్రూం టౌన్‌షిప్‌ను ప్రారంభించిన అనంతరం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీశ్‌రావు బుధవారం పరిశీలించారు. 30 వేల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
Hyderabad: తుదిదశకు సైక్లింగ్ ట్రాక్ పనులు.. రెండు నెలల్లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధునాతన సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ట్రాక్‌పై సైకిళ్లు పరుగులు తీయనున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 23 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యారణ పరిరక్షణ కోసం సైక్లింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.100 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును రెండు మార్గాల్లో చేపట్టారు. ఔటర్‌ను ఆనుకొని నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లలో ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలకు ధీటైన అభివృద్ధి జరుగుతుందని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తోన్న సైకిల్ ట్రాక్ నగర ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. ఆరోగ్యవిహారం... సైక్లింగ్ ట్రాక్‌లో సైకిళ్లపైన పరుగులు తీయడం కేవలం ఒక వ్యాయామ ప్రక్రియగానే కాకుండా ఒక విహారంలాంటి అనుభూతిని కలిగించేవిధంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ట్రాక్ పొడవునా అక్కడక్కడా రెస్ట్రూమ్లు, కెఫెటేరియాలు, బ్రేక్‌ఫాస్ట్ సెంటర్లు ఉంటాయి. అలాగే సైకిళ్లను ఇక్కడే అద్దెకు తీసుకోవచ్చు. సైకిళ్లకు పంక్చర్లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరమ్మతులు చేసి ఇస్తారు. ట్రాక్ పొడవునా తాగునీటి సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అలాగే ట్రాక్‌ను పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలో సైక్లింగ్ చేసేవారికి ఆకుపచ్చ నడవాలు పరుగులు తీస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ ట్రాక్‌పైన సైక్లింగ్ పోటీలను కూడా నిర్వహించనున్నారు. మరోవైపు భద్రత దృష్ట్యా ట్రాక్ పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్ వినియోగం... ట్రాక్‌పై కప్పును పూర్తిగా సౌరఫలకలతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను ట్రాక్ అవసరాలకు వినియోగించనున్నారు. లైట్లు, తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ వినియోగించగా మిగిలిన విద్యుత్‌ను ఇతరులకు వినియోగించే అవకాశం ఉంది. ఈ 23 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయిన తరువాత రెండో దశలో గండిపేట వద్ద అతి పెద్ద సైకిల్ ట్రాక్ నిర్మిచనున్నారు. -
పెసర్లంక, దోనేపూడి తిరునాళ్ల రక్తసిక్తం
కొల్లూరు(వేమూరు): గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక, దోనేపూడి గ్రామాల్లో ఆదివారం రాత్రి జరిగిన తిరునాళ్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాత కక్షల నేపథ్యంలో చిన్న వివాదం ముదిరి కత్తి పోట్లు, కర్రలతో దాడులకు దారితీసింది. ఇరు వర్గాల్లో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పెసర్లంకలో జరుగుతున్న తిరునాళ్లలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని.. బైక్ తగిలిందనే కారణంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, ఇటుక రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు వర్గాలకూ చెందిన 10 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. అందరికీ తలలు పగలడంతో 108 వాహనాల్లో తెనాలి వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న గళ్లా సాంబశివరావును గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు రెండు వర్గాలకూ చెందిన మొత్తం 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దోనేపూడిలో కత్తులతో దాడి.. ఇదిలా ఉండగా దోనేపూడి తిరునాళ్లలోనూ ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షల నేపథ్యంలో కొల్లూరుకు చెందిన యువకుల మధ్య జరిగిన గొడవ కత్తి పోట్లకు దారితీసింది. కనపాల ప్రశాంత్, కనపాల చందు, చొప్పర శరత్‌కుమార్‌లపై చొప్పర జయచంద్ర, చొప్పర సుధాకర్‌లు కత్తితో దాడి చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. గాయపడిన ముగ్గురినీ తెనాలి, గుంటూరుల్లోని ఆస్పత్రులకు తరలించారు. కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్‌కుమార్ రెండు కేసులనూ దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో విషాదం...
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. కొల్లూరు వద్ద కుందునదిలోకి దూకి ఓ కుటుంబం గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో భార్యా, భర్తతో పాటు కుమార్తె కూడా మృతి చెందింది. మృతులు రాజుపాలెం మండలం గాదెగూడురుకు చెందిన తిరుపతిరెడ్డి, వెంకట లక్ష్మమ్మ, ప్రవళికగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కాగా ప్రవళిక ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. చిన్న కుమార్తె ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు మనసు మార్చుకోవాలని సూచించారు. అయితే కుమార్తె ప్రవర్తనలో రాకపోవడంతో తిరుపతి రెడ్డి మనస్తాపం చెంది, భార్య, కుమార్తెతో ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అరిస్తే అంతు చూస్తా
కొల్లూరు, భట్టిప్రోలు (వేమూరు): ‘మీ మంత్రులను తీసుకొచ్చి గ్రామాల్లో పనులు చేయించండి. అంతేగాని ఇక్కడ అరిస్తే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరద బాధితులపై మండిపడ్డారు. నాకే ఎదురు చెబుతారా.. అంటూ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కొల్లూరు మండలం పోతార్లంకలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి రాకుండా పేద వారిని రోడ్డున పడేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది సరికాదని జనం చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారని.. భోజనం, మంచి నీరు అందించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మీరు మాట్లాడొద్దు.. నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు.. పేద ప్రజల తరఫున పోరాడటానికి వచ్చాను.. మీరిలా మాట్లాడితే మీ అంతు చూస్తా.. ఎవరినీ వదిలిపెట్టను.. నా నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటు మీ అంతు సైతం చూస్తా’ అంటూ ఊగిపోయారు. దీంతో స్థానికులు జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. తిప్పలకట్టలో సమస్యలు చెప్పాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరగా, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు ప్రోత్సాహమివ్వడంతో తమకీ దుస్థితి తలెత్తిందని చెప్పారు. -
శ్మశానంలో వరద నీరు చేరడంతో పడవలో..
సాక్షి, కొల్లూరు(గుంటూరు): కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకలో గడ్డం ధర్మారావు అనే వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేసేందుకు బంధువులు, స్థానికులు గురువారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానం చుట్టూ వరద నీరు చేరడంతో మృతదేహాన్ని పడవ ద్వారా తరలించి ఖనన కార్యక్రమాలు ముగించారు. -
మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో చేపట్టిన మెగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల పురోగతిని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఆకస్మికంగా తనీఖీ చేశారు. మంత్రి కేటీఆర్‌తోపాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి పనులను పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో పెద్ద ఎత్తున ఒకేచోట 15,600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. రామచంద్రాపురంలోని కొల్లూరు గ్రామంలో చిన్నపాటి సిటీని తలపించేరీతిలో ఈ మెగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ఇళ్లను నిరుపేద లబ్ధిదారులకు ఉచితంగా అందజేయనున్నారు. కొల్లూరులో 124 ఎకరాల స్థలంలో రూ. 1354.59 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా, మరెక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో ఈ కాలనీని మోడల్ సిటీగా నిర్మిస్తున్నారు. -
ఆ కలర్ వెనుక ఓ కథ
హోప్ డైమండ్.. అత్యంత అరుదైన నీలి రంగు వజ్రం!! భూమ్మీద ఉన్న కోటీ 38 లక్షల వజ్రాల్లో ఇలాంటివి 0.02 శాతమే ఉన్నాయి! ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పుట్టి.. ఎన్నో చేతులు మారి అమెరికా చేరిన ఈ వజ్రం.. ఓ అద్భుతం.. అపురూపం కూడా! వజ్రాలు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా? మొక్కలు నేలలో పెరిగితే.. వజ్రాలు రాళ్లలో పెరుగుతాయి! భూమి లోతుల్లోంచి బయటకొచ్చిన కొన్ని కర్బన స్ఫటికాలు అక్కడి ఒత్తిడి, పీడనాల కారణంగా వజ్రాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పటివరకూ దొరికిన వజ్రాల్లో అత్యధికం తెల్ల రంగువే. కొన్ని ఇతర రంగుల వజ్రాలు ఉన్నా.. నీలం రంగుతో కూడినవి అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల సుమారు 660 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఇవి ఏర్పడే అవకాశం ఉందని నేచర్ పత్రికలో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం తెలియజేస్తోంది. ఇంకోలా చెప్పాలంటే తెల్ల వజ్రాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ తవ్వితేగానీ నీలి రంగు వజ్రాలు దొరకవన్నమాట! ఇంకో విషయం.. వజ్రాలకు నీలి రంగు ఎలా అబ్బుతోందన్న విషయం ఈ పరిశోధన వెలువడేంత వరకూ ఎవరికీ తెలియదు! నీలి రంగు వచ్చేదిలా... వజ్రాలు రాళ్లల్లో పెరిగే క్రమంలో తమ పరిసరాల్లోని కొన్ని ఖనిజాలను తమలోకి కలిపేసుకుంటాయి. నీలి వజ్రాల విషయంలో ఖనిజం ‘బోరాన్’! చిత్రమైన విషయం ఏమిటంటే.. బోరాన్ భూమి ఉపరితలంపై, సముద్రపు నీటిలో మాత్రమే లభిస్తుంది. మరి భూమిలోతుల్లో పుట్టే వజ్రాలకు బోరాన్ ఎలా అంటిందన్న అంశంపై అమెరికన్ జెమలాజికల్ సొసైటీ శాస్త్రవేత్త ఇవాన్ ఎం.స్మిత్ పరిశోధనలు ప్రారంభించారు. హోప్ డైమండ్ లాంటి 46 నీలి వజ్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో వీటిల్లో బోరాన్తోపాటు కాల్షియం సిలికేట్ వంటి కొన్ని ఇతర ఖనిజాలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఇవన్నీ అత్యధిక పీడనం ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడేందుకు అవకాశమున్నవి కావడం గమనార్హం. భూమిలోపలి నుంచి వజ్రాలు ఉపరితలానికి వచ్చే క్రమంలో కాల్షియం సిలికేట్ వంటి ఖనిజాలు పేలిపోయేంత స్థాయిలో అస్థిరమయ్యాయని స్మిత్ తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు... ఈ రకమైన ఖనిజాలు భూమి పొరల మధ్య మాత్రమే ఏర్పడగలవని స్మిత్ అంచనా వేశారు. సముద్ర అడుగుభాగం.. భూమి లోపలి పొర (మాంటెల్) కలిసే చోటే నీలి రంగు వజ్రాలు ఏర్పడేందుకు అవకాశముందన్నమాట! కాలక్రమంలో ఇవి భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్ల కారణంగా పైపొరల్లోకి చేరి ఉంటాయని, సముద్రపు నీటిలోని బోరాన్ చేరడంతో వజ్రాలకు నీలి రంగు వచ్చి ఉంటుందని స్మిత్ అంచనా. కొల్లూరు గని వజ్రం.. ‘హోప్’ హోప్ డైమండ్ కొల్లూరు గనుల్లో పుట్టిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 16–19వ శతాబ్దాల మధ్య ఇక్కడ తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కూడా ఈ గనుల్లోనే దొరికిందని అంచనా. ప్రస్తుతం నిర్మాణమవుతున్న పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో 50 అడుగుల లోతులో ఉండేవి ఈ గనులు. అప్పట్లో గోల్కొండ నవాబుల అధీనంలో ఉన్న కొల్లూరు గనుల్లో ఒకదశలో ముప్ఫై వేల మంది పనిచేసేవారు. అయితే నవాబులు ఈ గనులను వజ్రాల వ్యాపారులు, విశ్వకర్మల కుటుంబాలకు లీజుకిచ్చేశారు. వజ్రాల అమ్మకాల్లో 2 శాతం కమిషన్, పది క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉన్న వజ్రాలు తమకే చెందాలన్నది నవాబులు విధించిన లీజు షరతు! అలా నవాబుల చేతికి చిక్కిన భారీ వజ్రం ఒకదాన్ని 1666 సంవత్సరంలో ఫ్రాన్స్ వజ్రాల వ్యాపారి జీన్ బాప్టీస్ ట్రావెర్నర్ కొనుగోలు చేసి తన పేరు పెట్టుకున్నాడు. ట్రావెర్నర్ ఈ వజ్రానికి సానబెట్టే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లోని నీలి రంగు వెలుగు చూసిందని చరిత్ర చెబుతోంది. 1668 సంవత్సరంలో ట్రావెర్నర్ ఈ నీలి వజ్రాన్ని కింగ్ లూయిస్‌కు అమ్మేశాడు. కొంత కాలం తరువాత ఇది గల్లంతైంది. 1791లో దీన్ని మళ్లీ ముక్కలు చేశారు. అతిపెద్ద ముక్కకు ‘హోప్’అని పేరు పెట్టారు. 1839లో హోప్ పేరున్న బ్రిటీష్ బ్యాంకింగ్ కుటుంబం తమ వద్ద ఉన్న విలువైన వజ్రాల జాబితాలోకి దీన్ని చేర్చింది. హోప్ కుటుంబం నుంచి ఇది చాలాసార్లు చేతులు మారింది. 1958 సంవత్సరంలో హ్యారీ విన్స్టన్ అనే అమెరికన్ వ్యాపారి దీన్ని వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి దానమిచ్చారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చిలుమూరు గుడిలో హీరో రాజేంద్రప్రసాద్ పూజలు
సాక్షి, కొల్లూరు: ప్రముఖ సినీ హీరో రాజేంద్రప్రసాద్ కృష్ణా తీరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన గుంటూరుజిల్లా చిలుమూరులోని ఉభయ రామలింగేశ్వర క్షేత్రాన్నిఆదివారం ఉదయం తన కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆయన తొలుత ఉభయ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భార్య, కుమారుడు, కోడలితో కలిసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. గోశాలను సందర్శించి గోపూజ చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో పల్లె వాతావరణాన్ని ఆస్వాదించిన రాజేంద్రుడు తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో కలిసి నెమరువేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ వస్తున్నట్లు తెలుసుకుని ఆయన్ను కలవడానికి వచ్చిన స్థానికులను చిరునవ్వుతో పలకరిస్తూ ఫొటోలు దిగారు. కొల్లూరు ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు క్రోసూరు అప్పయ్య, సర్పంచ్ మొలబంటి రామారావు తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి
-
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి
గుంటూరు : మెగా ఫ్యాన్స్ అభిమానం హద్దు మీరింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బెనిఫిట్ షో వేస్తామని శ్రీనివాస థియేటర్ యాజమాన్యం తెలిపింది. అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఖైదీ నెంబర్ 150 చిత్రం ఇవాళ (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. -
వైభవంగా రుద్రాభిషేకం
కొల్లూరు: ప్రత్యేక పూజలతో ఆదివారం కొల్లూరు అనంతభేగేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. అనతభోగేశ్వరస్వామికి రుద్రాభిషేకం, బిళ్వార్చన నిర్వహించారు. అనంతరం పార్వతీ అమ్మవారికి విశేషాలంకారణ జరిపి లక్ష కుంకుమార్చన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదపండితులు జనస్వామి వెంకటప్పావధానులు, విష్ణుభట్ల శ్రీరామచంద్రసోమయాజులు, చిట్టి రాధాకృష్ణమూర్తి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
జోరు.. హుషారు..
కొల్లూరు: పుష్కర సంబరాల్లో కుర్రాళ్ల సందడి అంతా ఇంతా కాదు.. ఉల్లాసంగా ఘాట్ల వద్ద గుమిగూడి పుష్కర స్నానాలు చేస్తున్నారు.. కేరింతలు కొడుతున్నారు.. నీళ్లు జల్లుకుంటున్నారు.. అంతేనా.. చిత్రంలో చూడండి.. కుర్రాళ్ల విన్యాసం ఎలా ఉందో ? గురువారం కొల్లూరు సమీపంలోని పుష్కర ఘాట్‌లో వీళ్లు సందడి చేయగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.