హోప్ డైమండ్..
అత్యంత అరుదైన నీలి రంగు వజ్రం!!
భూమ్మీద ఉన్న కోటీ 38 లక్షల వజ్రాల్లో ఇలాంటివి 0.02 శాతమే ఉన్నాయి!
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పుట్టి..
ఎన్నో చేతులు మారి
అమెరికా చేరిన ఈ వజ్రం..
ఓ అద్భుతం.. అపురూపం కూడా!
వజ్రాలు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా?
మొక్కలు నేలలో పెరిగితే.. వజ్రాలు రాళ్లలో పెరుగుతాయి! భూమి లోతుల్లోంచి బయటకొచ్చిన కొన్ని కర్బన స్ఫటికాలు అక్కడి ఒత్తిడి, పీడనాల కారణంగా వజ్రాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పటివరకూ దొరికిన వజ్రాల్లో అత్యధికం తెల్ల రంగువే. కొన్ని ఇతర రంగుల వజ్రాలు ఉన్నా.. నీలం రంగుతో కూడినవి అత్యంత అరుదైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి లోపల సుమారు 660 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఇవి ఏర్పడే అవకాశం ఉందని నేచర్ పత్రికలో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం తెలియజేస్తోంది. ఇంకోలా చెప్పాలంటే తెల్ల వజ్రాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ తవ్వితేగానీ నీలి రంగు వజ్రాలు దొరకవన్నమాట! ఇంకో విషయం.. వజ్రాలకు నీలి రంగు ఎలా అబ్బుతోందన్న విషయం ఈ పరిశోధన వెలువడేంత వరకూ ఎవరికీ తెలియదు!
నీలి రంగు వచ్చేదిలా...
వజ్రాలు రాళ్లల్లో పెరిగే క్రమంలో తమ పరిసరాల్లోని కొన్ని ఖనిజాలను తమలోకి కలిపేసుకుంటాయి. నీలి వజ్రాల విషయంలో ఖనిజం ‘బోరాన్’! చిత్రమైన విషయం ఏమిటంటే.. బోరాన్ భూమి ఉపరితలంపై, సముద్రపు నీటిలో మాత్రమే లభిస్తుంది. మరి భూమిలోతుల్లో పుట్టే వజ్రాలకు బోరాన్ ఎలా అంటిందన్న అంశంపై అమెరికన్ జెమలాజికల్ సొసైటీ శాస్త్రవేత్త ఇవాన్ ఎం.స్మిత్ పరిశోధనలు ప్రారంభించారు. హోప్ డైమండ్ లాంటి 46 నీలి వజ్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో వీటిల్లో బోరాన్‌తోపాటు కాల్షియం సిలికేట్ వంటి కొన్ని ఇతర ఖనిజాలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఇవన్నీ అత్యధిక పీడనం ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడేందుకు అవకాశమున్నవి కావడం గమనార్హం. భూమిలోపలి నుంచి వజ్రాలు ఉపరితలానికి వచ్చే క్రమంలో కాల్షియం సిలికేట్ వంటి ఖనిజాలు పేలిపోయేంత స్థాయిలో అస్థిరమయ్యాయని స్మిత్ తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు... ఈ రకమైన ఖనిజాలు భూమి పొరల మధ్య మాత్రమే ఏర్పడగలవని స్మిత్ అంచనా వేశారు. సముద్ర అడుగుభాగం.. భూమి లోపలి పొర (మాంటెల్) కలిసే చోటే నీలి రంగు వజ్రాలు ఏర్పడేందుకు అవకాశముందన్నమాట! కాలక్రమంలో ఇవి భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్ల కారణంగా పైపొరల్లోకి చేరి ఉంటాయని, సముద్రపు నీటిలోని బోరాన్ చేరడంతో వజ్రాలకు నీలి రంగు వచ్చి ఉంటుందని స్మిత్ అంచనా.
కొల్లూరు గని వజ్రం.. ‘హోప్’
హోప్ డైమండ్ కొల్లూరు గనుల్లో పుట్టిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 16–19వ శతాబ్దాల మధ్య ఇక్కడ తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం కూడా ఈ గనుల్లోనే దొరికిందని అంచనా. ప్రస్తుతం నిర్మాణమవుతున్న పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో 50 అడుగుల లోతులో ఉండేవి ఈ గనులు. అప్పట్లో గోల్కొండ నవాబుల అధీనంలో ఉన్న కొల్లూరు గనుల్లో ఒకదశలో ముప్ఫై వేల మంది పనిచేసేవారు. అయితే నవాబులు ఈ గనులను వజ్రాల వ్యాపారులు, విశ్వకర్మల కుటుంబాలకు లీజుకిచ్చేశారు. వజ్రాల అమ్మకాల్లో 2 శాతం కమిషన్, పది క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉన్న వజ్రాలు తమకే చెందాలన్నది నవాబులు విధించిన లీజు షరతు! అలా నవాబుల చేతికి చిక్కిన భారీ వజ్రం ఒకదాన్ని 1666 సంవత్సరంలో ఫ్రాన్స్ వజ్రాల వ్యాపారి జీన్ బాప్టీస్ ట్రావెర్నర్ కొనుగోలు చేసి తన పేరు పెట్టుకున్నాడు. ట్రావెర్నర్ ఈ వజ్రానికి సానబెట్టే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లోని నీలి రంగు వెలుగు చూసిందని చరిత్ర చెబుతోంది. 1668 సంవత్సరంలో ట్రావెర్నర్ ఈ నీలి వజ్రాన్ని కింగ్ లూయిస్‌కు అమ్మేశాడు. కొంత కాలం తరువాత ఇది గల్లంతైంది. 1791లో దీన్ని మళ్లీ ముక్కలు చేశారు. అతిపెద్ద ముక్కకు ‘హోప్’అని పేరు పెట్టారు. 1839లో హోప్ పేరున్న బ్రిటీష్ బ్యాంకింగ్ కుటుంబం తమ వద్ద ఉన్న విలువైన వజ్రాల జాబితాలోకి దీన్ని చేర్చింది. హోప్ కుటుంబం నుంచి ఇది చాలాసార్లు చేతులు మారింది. 1958 సంవత్సరంలో హ్యారీ విన్‌స్టన్ అనే అమెరికన్ వ్యాపారి దీన్ని వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి దానమిచ్చారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Published Mon, Aug 6 2018 2:21 AM | Last Updated on Mon, Aug 6 2018 2:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment