న్యూఢిల్లీ: కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.
తాజా పథకం ఈ ధోరణికి చెక్‌పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా భారత వజ్రాల పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్‌ఎంఈలకు తగిన అవకాశాలను కల్పిస్తుందని తెలిపింది. మరిన్ని ఉపాధి అవకాశాలకు మార్గం కల్పిస్తుందని పేర్కొంది. రెండు స్టార్ల ఎగుమతి హోదా కలిగి, ఏడాదిలో 15 మిలియన్ డాలర్లు అంతకంటే అధిక విలువ మేర ఎగుమతులు చేస్తున్న సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనానికి అర్హులని వెల్లడించింది.
ఇదీ చదవండి: భారత్ క్రెడిట్ రేటింగ్‌కు సవాళ్లు
25 క్యారట్ (25 సెంట్లు) అంతకంటే తక్కువ ఉన్న సహజ కట్, పాలిష్డ్ వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు పథకం అనుమతిస్తుందని స్పష్టం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అనే స్వతంత్ర సంస్థ గణాంకాల ప్రకారం.. 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 14 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు ఇదే కాలంలో 24.4 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment