హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ వజ్రాల పరిశ్రమ 2030 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయని డైమండ్ మైనింగ్ దిగ్గజం డిబీర్స్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ తొరాంజ్ మెహతా తెలిపారు. ప్రస్తుతం ఇది 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని వివరించారు. అమెరికా, చైనా తర్వాత మూడో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్ ఇప్పుడిప్పుడే గణనీయంగా వృద్ధి చెందుతోందని ఆమె తెలిపారు.
‘‘మెచ్యూరిటీని బట్టి చూస్తే జపాన్ పూర్తి స్థాయిని దాటేసింది. అమెరికా ప్రస్తుతం దగ్గర్లో ఉంది. చైనా వృద్ధి దశలోనూ, భారత్ వర్ధమాన స్థాయిలోనూ ఉంది’’ అని మెహతా వివరించారు. మధ్య ప్రాచ్యం, యూరప్ మొదలైన ప్రాంతాల మార్కెట్ వాటా సుమారు చెరో 7 శాతం స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. సూరత్‌లోని డిబీర్స్ అధునాతన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ సందర్శన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ‘‘భారత ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. మధ్యతరగతి జనాభా పెరగనుంది. డైమండ్స్ కొనుగోలు చేసే సంపన్న వర్గాల సంఖ్య మరింత ఎక్కువగా 25 శాతం మేర పెరగవచ్చని అంచనా.
అలాగే వయస్సు రీత్యా చూస్తే కూడా వజ్రాల వైపు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో దేశీయంగా పరిశ్రమ వృద్ధికి తోడ్పడనున్నాయి’’ అని మెహతా వివరించారు. ఫరెవర్ మార్క్ అనే తమ బ్రాండ్ విషయానికొస్తే అమ్మకాలపరంగా భారత్ అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోందని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమకు 60 నగరాల్లో 270 పైచిలుకు రిటైల్ అవుట్‌లెట్స్, 14 ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉన్నాయని మెహతా వివరించారు. కార్యకలాపాలను మరింతగా విస్తరించే క్రమంలో ఈ నెలాఖరు నాటికి ఇండోర్, మంగళూరులో కొత్తగా రెండు ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌ను తెరుస్తున్నట్లు ఆమె తెలిపారు.
దక్షిణాదిలో నాణ్యత .. ఉత్తరాదిలో పరిమాణం..
దక్షిణాది, ఉత్తరాది మార్కెట్లలో డిజైన్ల ప్రాధాన్యాలు చాలావరకు భిన్నంగా ఉంటాయని మెహతా తెలిపారు. దక్షిణాదిలో డైమండ్ పరిమాణం చిన్నదిగా ఉన్నా మంచి రంగు, అత్యుత్తమ క్వాలిటీకి ప్రాధాన్యమిస్తారని, అదే ఉత్తరాదిలో డైమండ్ పరిమాణానికి కొంత ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారని పేర్కొన్నారు. తమకు దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు అత్యధికంగా ఉండగా, ఉత్తరాదిలో పుంజుకుంటున్నాయని మెహతా చెప్పారు.
అతి పెద్ద కేంద్రం..
డిబీర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మూడు (బ్రిటన్, బెల్జియం, భారత్) డైమండ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా సూరత్‌లోని ఇనిస్టిట్యూట్ అతి పెద్దది. దీని ద్వారా డిబీర్స్ అధునాతన యంత్రాలు, నిపుణులతో డైమండ్ గ్రేడింగ్, టెస్టింగ్, ఇన్‌స్క్రిప్షన్ సేవలు అందిస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ కేంద్రంపై దాదాపు 15 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏడాదికి దాదాపు 10 లక్షల సర్టిఫికెషన్లు చేసే సామర్థ్యాలతో ఇది ఏర్పాటైంది.
Comments
Please login to add a commentAdd a comment