ఆభరణాల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ హవా మొదలైంది. ఆభరణాల్లో పొదగడం మొదలైన తర్వాత వీటి గురించి తెలుస్తోంది. కానీ నిజానికి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ 1950లలోనే మొదలైంది. అప్పట్లో పారిశ్రామిక అవసరాలకు, డెంటల్ ట్రీట్‌మెంట్, ఎయిర్΄ోర్ట్ రన్‌వేలలో ఉపయోగించేవారు. వజ్రానికి ఉన్న గట్టిదనం దృష్ట్యా వీటిని ఉపయోగించేవారు. అప్పటి వరకు డైమండ్ అంటే మనకు తెలిసింది ఆభరణాల్లో వాడే మైన్‌డ్ డైమండ్స్ గురించి మాత్రమే.
ఇవి భూమిలోపలి పొరల్లో కార్బన్, వాయువుల ఒత్తిడితో వేల సంవత్సరాలకు వజ్రం రూపం సంతరించుకున్నాయి. అదే కంపోజిషన్‌లో అదే వాతావరణ పరిస్థితులను లాబొరేటరీలో కల్పించినప్పుడు డైమండ్ ఓర్ పూర్తిస్థాయి వజ్రంగా రూపొందుతుంది. అంటే భూమి పొరల్లో వందల ఏళ్లకు జరిగే ప్రక్రియ లాబొరేటరీలో కొద్ది వారాల్లో పూర్తవుతుంది.
వజ్రాల రాశిలో నుంచి ల్యాబ్ డైమండ్‌ని, మైన్‌డ్ డైమండ్‌ని వేరు చేయడం సాధ్యం కాని పని. థర్మల్ కండక్టివిటీ పెన్ టెస్ట్ ద్వారా కూడా వర్గీకరించలేం. అడ్వాన్స్‌డ్ యూవీ కార్బన్ డాటింగ్ టెస్ట్ ద్వారా వజ్రం వయసును కనుక్కోవడం మాత్రం సాధ్యమవుతుంది.
క్లారిటీ వర్గీకరణ, కలర్ గ్రేడింగ్, సర్టిఫికేషన్‌లో రెండింటికీ ఒకే ప్రమాణాలు పాటిస్తారు. ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్‌లో పోల్కీలు కూడా వస్తున్నాయి.
సాధారణంగా అయోమయానికి గురి చేసేవి అమెరికన్ డైమండ్స్ మాత్రమే. ఆ పేరుతో దొరికేవి సీజెడ్స్. అంటే క్యూబిక్ జెరకాన్స్. సాంకేతిక నామం సీజెడ్స్ అయితే వాటిని మార్కెట్‌లోకి తెచ్చిన బ్రాండ్ పేరు అమెరికన్ డైమండ్స్. ఇప్పుడు లభిస్తున్న మోజనైట్స్ కూడా దాదాపు అలాంటివే. వాటిని సిమిలెంట్స్, సింథటిక్స్ పేర్లతో వ్యవహరిస్తారు.
ధరించడం, భద్రపరచడం విషయంలో ల్యాబ్ డైమండ్స్ పొదిగిన ఆభరణాలకు కూడా మైన్‌డ్ డైమండ్స్ ఆభరణాలకు పాటించిన నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చే ప్రధానమైన సందేహం రీసేల్ వాల్యూ గురించి. ల్యాబ్ డైమండ్స్‌కి కూడా నూటికి నూరుశాతం ఎక్సేంజ్ వాల్యూ, 80 శాతం రీసేల్ వాల్యూ ఉంటుంది.
– విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment