ఇదీ.. సంక్షేమ రంగంలోనే మేలిమలుపుగా దేశవ్యాప్త చర్చకు దారితీసిన ‘డబుల్ బెడ్రూం ఇళ్ల’పథకం ప్రస్తుత పరిస్థితి. ‘సింగిల్ కాదు.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం.. అదీ పూర్తి ప్రభుత్వ ఖర్చుతోనే!’.. అని ప్రభుత్వం చెప్పడంతో నిరుపేదలు తమ ఊహలకు రెక్కలు తొడిగారు. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ (ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్) కాలనీ తరహాలోనే తమకూ కొత్త జీవితం వస్తుందని ఆశపడ్డారు.
ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల నిర్మాణానికి వ్యూహరచన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. కానీ, ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు మాత్రం 2.76 లక్షలే. వీటిలో నిర్మాణం పూర్తయింది సగం కంటే తక్కువే. అదీగాక ఇళ్లు పూర్తయినా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇంకా తక్కువే.
వీటికితోడు అన్ని సదుపాయాలు కల్పించిన ప్రాంతాల్లోనూ ఇళ్లు పంపిణీ చేయకపోవడం శోచనీయం. ఇన్ని అడ్డంకులు దాటుకుని తీరా కేటాయింపులు చేసే సమయంలో రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేస్తుండటంతో నిరుపేదల ఆశలు అడియాసలవుతున్నాయి. ఫలితంగా సమున్నత పథక లక్ష్యం పక్కదారి పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
– శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి
దొంగలతో.. మళ్లీ మొదటికి..
మెదక్ జిల్లా రామాయంపేటలో చాలాకాలం క్రితమే 300 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ఉన్న ఇళ్ల కంటే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే నిధుల కొరత ఉండటంతో మౌలిక సదుపాయాల కల్పనలోనూ జాప్యం చేశారు. ఈలోగా ఆ ఇళ్లలో దొంగలు పడి విద్యుత్ వైర్లను పూర్తిగా ఎత్తుకుపోయారు. దీంతో అన్ని ఇళ్లకు మళ్లీ వైరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తాన్ని ఎవరు భరించాలో స్పష్టత లేక అధికారులు తల పట్టుకుంటున్నారు.
మరుగుదొడ్డిలో.. ఏడాదిగా..
మెదక్ జిల్లా రామాయంపేటలో డబుల్ బెడ్రూం ఇల్లు కోసం రామలక్ష్మి ఎదురుచూస్తోంది. మూడేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకుంది కూడా. అయితే ఆమెకు ఎక్కడా నిలువ నీడ లేక ఇప్పుడు కొడుకుతో కలిసి ఆర్ అండ్ బీ శాఖ వదిలేసిన అతిథి గృహంలోని మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో ఏడాది కాలంగా ఈ మరుగుదొడ్డిలో కాలం వెల్లదీస్తోంది.
ఉన్న ఇల్లు ఖాళీ చేసి..
మేం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. మేం ఇతరుల స్థలంలో రేకులతో షెడ్డు వేసుకుని చలికి వణుకుతూ, వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నాం. ఉన్న ఇళ్లు పోయి, డబుల్ బెడ్రూం రాక అవస్థలు పడుతున్నాం.
–లాల్‌కోట రాజు, చౌదరిపల్లి, మహబూబ్‌నగర్
ప్రతి చోటా రాజకీయ స్వార్థం వద్దు
ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా అర్హులకు చేరేలా పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్రంలో అలా కనిపించడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలోనూ నిజమైన నిరుపేదలను గుర్తించే బాధ్యతను అధికారులకు అప్పగించాలి. కానీ రాజకీయ సిఫారసు ఉంటేనే డబుల్ బెడ్రూం అయినా, మరోటి అయినా వచ్చే పరిస్థితి ఉంది. చాలాచోట్ల ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయడం లేదు. ప్రతి పనిలో రాజకీయ స్వార్థం చూసుకోవడం వ్యవస్థకు మంచిదికాదు.
–జస్టిస్ కె. చంద్రకుమార్
కొత్త ఇళ్లు.. పాత పడిపోయినా..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 720 ఇళ్ల నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. మౌలిక సదుపాయాలకు నిధులు లేక పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. ఈలోగా ఇంటి అద్దాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. ఆశావహుల సంఖ్య వేలల్లో, ఇళ్లు మాత్రం వందల్లో ఉండటంతో ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నిలువ నీడ కోసం.. నిలువెల్లా కనులై.. కామారెడ్డిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఈ నిరుపేద దంపతులు నిలువెల్లా కనులతో ఎదురుచూస్తున్నారు.
ఊరూరా తిరుగుతూ చిరు వ్యాపారం చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు అండ్రాసి సాయవ్వ, రంగయ్యలు. ఇప్పుడు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు వీళ్లు వెళ్లని ఆఫీసు, కలవని అధికారి లేడంటే అతిశయోక్తి కాదు.
తొలి అడుగు పడిందిలా..
2015 తొలినాళ్లలో సికింద్రాబాద్ బోయిగూడలో ఐడీహెచ్ కాలనీతోపాటు మరో నాలుగు మురికివాడల్లో ఇరుకుగదులు, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉంటున్న వారిని ఒప్పించి రూ.37 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టు పద్ధతిన 33 బ్లాకుల్లో ప్రతి ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వంటగది రెండు బెడ్రూంలను కేవలం 11 నెలల్లో నిర్మించి 396 మందికి అందజేశారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7.90 లక్షలు, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు ఇతర సదుపాయాల కోసం రూ.1.33 లక్షల చొప్పున ఖర్చు చేసి యాభై ఏళ్ల మురికివాడను క్లాస్ కాలనీగా తీర్చిదిద్దారు. జీహెచ్‌ఎంసీ చొరవతో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రాష్ట్రమంతటా డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం 2015 నవంబర్‌లో ప్రకటించింది.
పేదలను వదిలి.. నాయకులకు..
మహబూబ్‌నగర్‌లో ఏటా నీటమునిగే బస్తీల్లో శిథిలావస్థకు చేరిన పేదల కోసం దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. అయితే ఇందులో ఇప్పటికే 100 ఇళ్లను ముఖ్యనాయకుల సిఫారసుల మేరకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను వార్డు, ఇతర ముఖ్యుల సూచన మేరకు కేటాయించేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో కేటాయింపుల కోసం భారీగా డబ్బులు వసూలు చేయడం, కొందరిని అరెస్ట్ చేయడం, మంత్రి పీఏ కుమారుడి ఆత్మహత్య లాంటి ఘటనలతో ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఫలితంగా అవన్నీ ఇప్పుడు పిచ్చిమెక్కలతో నిండిపోయాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో మౌలిక సదుపాయాల పనులు నిలిపేశారు.
Comments
Please login to add a commentAdd a comment