తలసాని కోసం 40 నిమిషాలు ఎదురు చూశాం | CLP Leader Bhatti Vikramarka Over Double Bedroom Houses | Sakshi
Sakshi News home page

మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్లు 2016 నాటివి: భట్టి

Published Sat, Sep 19 2020 2:06 PM | Last Updated on Sat, Sep 19 2020 2:31 PM

CLP Leader Bhatti Vikramarka Over Double Bedroom Houses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లక్ష ఇళ్లు చూపిస్తా అన్నా తలసాని రెండో రోజు పర్యటన మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్లారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండి పడ్డారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతు మమ్మల్ని వదిలేసిన ప్రాంతంలోనే మళ్లీ వస్తారని 40 నిమిషాలు వేచి చూశామని తెలిపారు. శనివారం ఇందిరా భవన్‌ పీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నుంచి కేటీఆర్, తలసాని వరకు అందరూ గ్రేటర్ సిటీ ప్రజలను ప్రతి ఎన్నికల సమయంలో మోసం చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పేదల అవసరాలను ఓట్లుగా మలుచుకొని ఆ తరువాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. 2016 అసెంబ్లీలో కేసీఆర్.. 2017 లో కేటీఆర్.. 2020లో తలసాని అసెంబ్లీలో లక్ష ఇళ్లు అన్నారు. గత ఎన్నికల్లో ఒక్క ప్రాంతంలో ఇళ్లు కట్టి గ్రేటర్ సిటీ ఓట్లు దండుకున్నారు. 150 డివిజన్లలో 96వేలు ఇళ్లు ఉండాలి.. కానీ ప్రభుత్వం చూపించింది 3,400 మాత్రమే. 24 నియోజవర్గాల్లో 96వేల ఇళ్లు ఉండాలి.. నాలుగు నియోజవర్గాల్లో 3వేల ఇళ్లు మాత్రమే చూపించారు’ అని తెలిపారు భట్టి. (చదవండి: ‘డబుల్‌’ కాక)

‘గ్రేటర్‌లోనే ఇళ్లు చూపిస్తా అన్న తలసాని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజావర్గంలో ఉన్నవి చూపించారు. మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్లు ఇప్పటి కావు 2016లోవి. అక్కడి ప్రజల ఇండ్లను గ్రేటర్ సిటీ ఇళ్లు అని మాయ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేవలం 3,400 ఇళ్లు మాత్రమే కట్టారు.. ఒక లక్ష ఇళ్లు అన్న మాట అవాస్తవం. నాలుగేళ్ల క్రితం 150 కుటుంబాలను అంబేద్కర్ కాలనీలో ఖాళీ చేయించారు.. ఇప్పటి వరకు ఆ కాలనీ అంతా ఖాళీగానే ఉంది. మల్లెపల్లిలో సైతం శంకుస్థాపన చేసి ఖాళీగా వదిలేశారు. నాలుగేళ్ల నుంచి పేదల ఇబ్బందలు పట్టించుకోవడం లేదు. మోసాలకు పాల్పడే టీఆర్‌ఎస్‌ను మళ్ళీ నమ్మితే పేదలకు న్యాయం జరగదు. ప్రభుత్వ మోసాలను గ్రేటర్ సిటీలో ప్రతి డివిజన్‌లో తిరిగి చెప్తామన్నారు భట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement