సాక్షి, హైదరాబాద్: సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే సరికొత్త గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర సర్కారు విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు పడక గదుల (డబుల్ బెడ్‌రూమ్) ఇళ్ల నిర్మాణ పథకం పూర్తిస్థాయి సవరణలతో, దానితో ఏ మాత్రం పోలిక లేకుండా కొత్త రూపుతో ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇంటికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరొక గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. వీటితో పాటు ఇతర విధివిధానాలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని భారీగా సవరించి చేపడుతున్న నేపథ్యంలో..కొత్త పథకంలో సీఎం కేసీఆర్ మార్పులు, చేర్పులు చేస్తారని భావిస్తున్నారు.
యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం విఫలమైందన్న ప్రచారానికి అవకాశం కల్పించకుండా, దీన్ని కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఆయన మార్పులు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాగానే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మార్పులు చేర్పుల ఆధారంగా తుది విధివిధానాలు రూపొందించి అధికారికంగా వెల్లడించనున్నారు. లేదంటే ప్రాథమిక అంశాలే తుది విధివిధానాలుగా ఖరారు కానున్నాయి.
ఆదినుంచీ అవాంతరాలే..
రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆది నుంచి ఎదురవుతున్న అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు సాగనీయటం లేదు. మొత్తం 2.27 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అయితే 1.10 లక్షల ఇళ్లే పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు కనీసం 20 వేల ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదు. మిగతా వాటికి సంబంధించి అసలు లబ్ధిదారుల జాబితాలనే రూపొందించలేదు.
దీన్ని తప్పుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సొంత ఇంటి పథకం మార్పు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రాథమికంగా విధివిధానాలు ఖరారు చేసింది.
ప్రాథమికంగా ఇలా..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రాథమికంగా రూపొందించారు.
►ఈ ఇళ్లను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి (బీపీఎల్) మాత్రమే మంజూరు చేస్తారు.
►ఈ ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన దాఖలాలున్నాయి. సొంత స్థలాలున్న వారి సంఖ్య అందుకు సరిపడా లేదనుకున్నప్పుడు జనాభాలో వారి శాతం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి.
►పట్టణ ప్రాంతాల్లో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికి 12 శాతం ఇళ్లు కేటాయించాలి.
►ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రెండు గ్రామ సభల ద్వారా చేపట్టాలి. తొలి గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించాలి. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటి పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితా రూపొందించి రెండో సభలో వివరాలు వెల్లడించాలి. అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించాలి.
►ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను కేటాయిస్తారు. మరికొన్ని ఇళ్లు ముఖ్యమంత్రి విచక్షణాధికారం పరిధిలో ఉంటాయి. వెరసి 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు.
►ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.3 లక్షలు కేటాయిస్తారు. వాటిని ఇళ్ల నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు.
►కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు 58, 59 జీవోల ద్వారా కల్పించిన వెసులుబాటు పరిధిలో ఉన్నవారు ఈ ఇళ్లు పొందేందుకు అనర్హులు.
Comments
Please login to add a commentAdd a comment