
సాక్షి,హైదరాబాద్: లక్ష ఇళ్లు కట్టాం.. కావాలంటే వెళ్లి చూసుకోండని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం చెప్పిన మాటల్లో నిజం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ ఎంపీలు హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్‌తో కలసి మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ’డబుల్’ లిస్ట్ పూర్తిగా బోగస్ అని వ్యాఖ్యానించారు. కట్టకపోయినా కట్టినట్టు లిస్ట్‌లో చూపించారని, కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ప్రజలకు నిజాలను చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం చెబుతున్న లక్ష ఇళ్ల జాబితాలోని ఒక్కో ప్రాంతాన్ని మీడియాకు చూపించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ కార్పొరేట్లతో ఏసీ రూముల్లో చర్చలు జరపడం సరికాదని, బస్తీ ప్రజల బాధల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం చెప్పిన ప్రాంతంలో దుర్బిణీ వేసి వెతికినా ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాకే టీఆర్‌ఎస్ నాయకులను బస్తీల్లోకి అడుగుపెట్టనివ్వాలని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment